Dec 11,2022 23:50

, దేవరాపల్లిలో తడిసిన వరి పనలు

ప్రజాశక్తి-నక్కపల్లి:అకాల వర్షం రైతన్నల కొంపముంచింది. వరి పంట చేతికందే సమయంలో వర్షం కారణంగా నష్టాన్ని మిగిల్చింది. అకాల వర్షం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆదివారం కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వరి చేను నేలకు ఒరిగిపోగా, పంట పొలాల్లో ఉన్న కోసిన వరి పనలు పూర్తిగా తడిసిపోయాయి. మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి వరి పంట సర్వనాశనం అయ్యింది. కోసిన వరి చేను కుప్పలు వేయడానికి అవకాశం లేకపోవడంతో రైతులు పొలాల్లోనే ఉంచడంతో మూడు రోజుల నుండి కురిసిన వర్షానికి వరి పనలు తడిసిపోవడంతో ధాన్యం గింజలు రాలి పోతాయని, దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోత దశలో ఉన్న వరి చేను నేల కొరిగి పోవడంతో ,రైతులు వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఒక పక్క వర్షం కురుస్తున్నప్పటికీ గత్యంతరం లేక రైతులు కోతలు కోస్తున్నారు.వర్షం కారణంగా వరి పంట దెబ్బతినడంతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు సూచనలు పాటించాలి
వరి పంట కోతకు వచ్చిన దశలో వర్షం కారణంగా ధాన్యం గింజలు, మొలక రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి ఉమా ప్రసాద్‌ సూచించారు. కోత దశలో ఉన్న వరి వెన్నుల మీద లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పును కలిపి పిచికారి చేయాలని సూచించారు. పైరు పనలు తడిస్తే లీటర్‌ నీటికి 50 గ్రాములు ఉప్పును కలిపి వరి కంకులను ముంచి ఆరబెట్టి చిన్నచిన్న కుప్పలుగా వేయాలన్నారు.
కోటవురట్ల:తుఫాన్‌ ప్రభావంతో మండల వ్యాప్తంగా ఆదివారం ఓ మోస్తరు వర్షపాతం నమోదయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి పంట పొలాలు, ప్రధానంగా కోతలు పూర్తయిన వరి పంట పూర్తిగా దెబ్బతింది. శనివారం రాత్రి నుండి మొదలైన వర్షాలు ఆదివారం మరి కాస్త ఎక్కువ అయ్యాయి. కొన్నిచోట్ల కోసిన వరి పంటను రైతులు చేసేది ఏమీ లేక పొలంలోనే వదిలేశారు. అదేవిధంగా కోతకు సిద్ధంగా ఉన్న పంట సైతం వర్షానికి దెబ్బ తింటుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట తడిసి పోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
స్పందించని సచివాలయాల సిబ్బంది
ఇదిలా ఉండగా మండల కేంద్రం, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది ఎవరు అందుబాటులో లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి దెబ్బతిన్న పంటకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు లేకపోవడంతో రైతన్న దిగాలిగా ఎదురుచూస్తున్నాడు.
నేలకు ఒరిగిన వరి
మాకవరపాలెం: మండలంలో ఆదివారం ఉదయం నుంచి చిరుజల్లు కురిసాయి. శనివారం, ఆదివారం పడిన జల్లులకు పల్లపు ప్రాంతంలో నీరు చేరింది. మరో పక్క కోసేందుకు సిద్ధంగా వరి పంట తుఫాను గాలులకు మండలంలో మాకవరపాలెం, చంద్రయ్యపాలెం, తామరం, కొండలఅగ్రహారం, గిడుతూరు గ్రామాల్లో వరి చేలు నేలకు ఒరిగాయి. కొన్నిచోట్ల కోసిన వరి చేనులు తడిచి పోయాయి.
చీడికాడ:గత మూడు రోజులుగా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు వరి పైరు పాడవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. నాలుగు నెలలుగా శ్రమించి పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే దశలో పంట ప్రకృతి కారణంగా వర్షాల పాలు కావడంతో ఏమి చేయాలో తెలీక దిక్కు తోచని తెలిస్థితిలో రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన పంటకి గిట్టుబాటు ధర రాదని, దళారీలకే అమ్ముకోవాల్సి వస్తుందని దీనంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
అనకాపల్లి : మరికొద్ది రోజుల్లో వరి పంట చేతికందుతుందన్న తరుణంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నేలమట్టం అయింది. పట్టణంలో సౌత్‌ 2లో అత్యధికంగా వరి పంట నేలకొరిగింది. నిన్న మొన్నటి దాకా ఆశాజనకంగా ఉన్న పైర్లను చూసి మంచి దిగుబడులు వస్తాయని మురిసిపోయిన రైతన్నల ఆశలపై ఈ వర్షాలు నీళ్లు జల్లాయి. మరో రెండు మూడు రోజులపాటు ఇలాగే వర్షాలు కురిస్తే వరి పంట మొలకెత్తే పరిస్థితి ఉందని వాపోతున్నారు.
దేవరపల్లి : మండలంలోని నాగయ్య పేట, కాశీపురం, పెదనందిపల్లి, చిన్న నందిపలి,్ల తారువ, తిమిరం తదితర గ్రామాల్లో వరి పంటలు కోసి వర్షాలు కురవడంతో పొలాల్లోనే కొంతమంది చిన్నచిన్న కుప్పలు వేశారు మరికొందరు అవకాశం లేకపోవడంతో కోసిన పంట కోసినట్టే వదిలేశారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో చేను, ధాన్యం తడిసి పాడౌతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరిపైర్లతోపాటు మినుములు, పెసలు ఇతర పంటలకు నష్టం జరుగుతుందని రైతులు అంటున్నారు.
బుచ్చయ్యపేట : రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాల్లో రైతులు వంట పొలాల్లోనే కోసి విడిచిపెట్టిన వరి పంట నీట మునిగిపోయింది.మండలంలో గల చిన్నప్పన్నపాలెం ,వడ్డాది ,దిబిడి ,బుచ్చయ్యపేట, కందిపూడి ,తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట పంట పొలాల్లోనే తడుస్తూ ఉంది.
మునగపాక రూరల్‌: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే దశలో నీట మునగటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మాండోస్‌ తుపాను దాటికి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు నేల వాలాయి. వర్షం,దానికి తోడు బలమైన గాలులు వీ యటంతో బరువెక్కిన కంకులతో కలకలలాడిన వరి పంట భూమి పాలై నీటిలో తడిసి ముద్దయి పంట కోత దశకు వచ్చే తరుణంలో నేల పాలవటంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
రాంబిల్లి : మండలంలోని దిమిలి, తెరవపల్లి, కలవలపల్లి, వైలలోవ గ్రామాల్లో సుమారు 200 ఎకరాల వరిపైర్లు నేలవాలి, ముంపునకు గురయ్యాయని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు.