Aug 19,2023 21:14

చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలుపుతున్న వంతెన సాధన కమిటీ సభ్యులు

ప్రజాశక్తి - కొమరాడ : ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం కోసం మూడో రోజు చెవిలో పువ్వులు పెట్టుకొని రిలే నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు. వంతెన పూర్తి చేయాలను కోరుతూ కోమట్లపేట వద్ద వంతెన సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నారు. మండలంలో 31 పంచాయతీలకు సంబంధించి అందులో 9 పంచాయతీలకు అతిముఖ్యమైన వంతెన దేవుకోన పంచాయతీ పూర్ణపాడు-లాబేసు వంతెన పెండింగ్‌ పనులు పూర్తిచేసి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని సాధన కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. 2006లో శంకుస్థాపన చేసినా నేటికీ వంతెన పూర్తి చేయకపోవడం పాలకుల చేతకానితనానికి నిదర్శమన్నారు. గిరిజనులు నాగవళి నదిపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నా కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్లయినా కనీసం ఒక సిమెంట్‌ బస్తా పని కూడా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. వంతెన నిర్మాణానికి నిధులు పెంచామని ఆర్బాట ప్రచారాల తప్ప పని మాత్రం జరగలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం, అధికారులు స్పందించి వంతెన పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. లేకపోతే నిరసన దీక్షను మరింత ఉధృతి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సాధన కమిటీ సభ్యులు శ్రీనివాసరావు నూకరాజు తదితరులున్నారు.