Feb 08,2021 13:42

   రామయ్యకి కొంత కాలంగా చెవిలో ఏదో దూరినట్లు ఒకటే దురదగా ఉంది. అలా దురద పుట్టినప్పుడల్లా పుల్లకు దూది చుట్టి గుండ్రంగా తిప్పి దూది, పుల్ల అవతల పారేసేవారు రామయ్య.
మళ్ళీ కాసేపటికే దురద మొదలయ్యేది. చెవిలో వేలు పెట్టుకుని గిల కొట్టేవాడు అస్తమాను చెవిలో పుల్ల పెట్టడం ఎందుకని.
కానీ రాత్రి పూట పడుకునే సమయంలో మరింత ఇబ్బంది పెట్టేది చెవి.
సీతమ్మకి చెబితే 'గుఱ్ఱపు చెవిలో పురుగు దూరిందేమో?' అనే అనుమానం వెలిబుచ్చారావిడ.
మళ్ళీ అదొక ఆందోళన చుట్టుకుంది రామయ్యకి. 'గుఱ్ఱపు చెవిలో పురుగు' అంటే అది ఒక పట్టాన బైటకు రాదు. ఉండలు చుట్టుకుని లోపలే స్థిర నివాసం ఉండిపోతుంది అద్దె, బద్దె లేకుండా.
ఏం చెయ్యాలో అర్థం కాలేదు రామయ్యకి. పోనీ చెవుల డాక్టరుకు చూపిద్దామంటే 'చెవిలో దురద పుడితే గోక్కోండి. దానికి నా దాకా ఎందుకు అంటాడేమో?' లేక 'ఆపరేషన్‌ చెయ్యాలంటాడేమో?' అనే అనుమానం పట్టుకుంది.
బావమరిది సలహా మేరకు చెవిలో కొబ్బరినూనె వైద్యం చేశాడు. చెవిలో రెండు చుక్కలు పడగానే చెవులు దిబ్బలు కట్టేసి జివ్వుమనడం, ఈయన చెవిలో నుండి నూనె ఒంపేయడం, సీతమ్మ విసుక్కోవడం.. ఇలా కొంతకాలం జరిగింది. రోజు రోజుకీ చెవిలో దురద ఎక్కువవుతోంది కానీ పరిష్కారం కనపడటం లేదు రామయ్యకి.
కొడుకు అమెరికా నుండి తెలిసిన వైద్యునికి ఆన్లైన్‌లో తండ్రి చెవి చూపించాడు. ఆ డాక్టరేమో హిందీ వాడు. అతగాడి ఇంగ్లీషు హింగ్లీషే తప్ప అసలైన ఇంగ్లీషు కాకపాయె. రామయ్యకి హిందీ రాదు. అతడి హింగ్లీషు అర్థమై చావదు.
ఎలాగోలా కొడుకు దుబాసీ పనితో చెవి అటు తిప్పి ఇటు తిప్పి.. అంటే ఫోనునే అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి సీతమ్మ టార్చిలైటు వేస్తుండగా చెవి అంతరాలయం లోపలకు తొంగిచూశాడు. అదీ అంత తేలిగ్గా అవలేదులెండి.. టార్చ్‌ చెవి మీద వెయ్యమంటే ఫోను మీద వేసేది. చెవిలో వెయ్యాలండి అంటే ఫోను పక్కన పడేసి చెవిలో టార్చ్‌ వేసేది. అప్పటికీ ఏమీ కనపడలేదు ఆ హింగ్లీష్‌ డాక్టరుకి. కొడుకు సూచనల మేరకు ఫోను రామయ్య పట్టుకుంటే సీతమ్మ చెవి గట్టిగా లాగి, టార్చ్‌ ఫోకస్‌ చేసింది.
'ఏవే చెవ్వట్టా లాగుతున్నావు? అంత గట్టిగా లాగితే ఊడొస్తుందేమో?' అనేవారు రామయ్య.
'వస్తే వచ్చిందిలెండి. అప్పుడు మరింత చులాగ్గా చూడొచ్చు' అంది సీతమ్మ.
ఆ వంకన చెవి మెలేస్తోందేమోనని రామయ్య అనుమానం. మధ్య మధ్యలో దురద వల్ల ఆ టార్చ్‌ ఫోకస్‌, చెవి మెలేయడం.. అదే చెవి లాగడంలాంటి వాటికి స్వల్ప విరామం వచ్చేది.
మళ్ళీ కాసేపటికి తతంగం మొదలయ్యేది. అలా గంట తంటాలు పడ్డాక ఆ హింగ్లీష్‌ డాక్టర్‌ గారికి అంతరాలయ ప్రవేశం లభించింది.. కానీ గర్భగుడి మాత్రం కనపడలేదు.
ఇలా కాదని కొడుకు తండ్రిని తనకు తెలిసిన తమ ఊరిలోనే ఉండే ఇఎన్‌టి డాక్టరు ఒకాయన ఉంటే అతడి అడ్రస్సు, ఫోన్‌ నంబరు ఇచ్చాడు. తనూ ఫోన్‌ చేస్తానని చెప్పాడు.
ఒక మంచిరోజు చూసుకుని అపాయింటుమెంటు తీసుకుని వెళ్ళారు దంపతులిద్దరు. అక్కడ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు వేసుకుని, శానిటైజర్లు రుద్దుకుని, ఒకరొకరే వెళ్తున్నారు. గంట తర్వాత ఈయనకు పిలుపొచ్చింది. అయనొక్కణ్ణే లోపలకు పంపించారు బయట సిబ్బంది.
ఈయన లోపలకెళ్లి, కూర్చున్నాడు.
'అటువైపు తిరిగి కూర్చోండి' అన్నారు డాక్టర్‌.
'చెవి ఇటువైపు ఉందండీ!' అన్నారు రామయ్య.
'చెవి ఎటువైపున్నా పర్లేదండి. కరోనా కదా! మొహంలో మొహం పెట్టి చూడటం సేఫ్టీ కాదు కదా? అందుకన్న మాట' అన్నారు డాక్టర్‌.
చెవి లోపలకు చూసినా చూడకపోయినా తను రాసే టెస్టులు ఒకటే కాబట్టి ఆయనకు ఆ పట్టింపులేక పోయిందన్న మాట. ఆయన అసిస్టెంటు మాత్రం రామయ్య చెవి పట్టుకున్నాడు, లాగుతున్నాడు, టార్చ్‌ వేస్తున్నాడు. డాక్టర్‌ మాత్రం అసిస్టెంట్‌ చెప్పిన వివరాలు రాసుకుని, కళ్ళజోడు తీసి బల్ల మీద పెట్టి దీర్ఘంగా నిట్టూర్చి, చీటీ తీసుకుని సిటి స్కానింగు, ఎమ్మారై స్కానింగు రాసి అవి చేయించుకుని రమ్మన్నారు.
'అవెందుకు?' అన్నారు రామయ్య.
'లోపల సమస్యను సరిగా అంచనా వెయ్యకపోతే అది మెదడు దాకా పాకే ప్రమాదం ఉంది!' అన్నారు డాక్టరు.
మారు మాట్లాడకుండా ఆ కాయితమ్ముక్క తీసుకుని బైటపడ్డారు రామయ్య.
బైటకు రాగానే పాతికేళ్ళ అమ్మాయి రామయ్య చేతిలో కాయితం తీసుకుని 'నాతో రండి' అంది.
సీతమ్మ కూడా వెంట బయల్దేరారు.
'మీర్రాకూడదండి' అన్నది ఆ అమ్మాయి.
సీతమ్మ ఆ అమ్మాయి వంక, రామయ్య వంక చూశారు.
రామయ్య తలొంచుకుని ఆ పిల్ల వెంట వెళ్ళారు.
మరో రెండు గంటలపాటు రామయ్య ఆచూకీ కనపడలేదు సీతమ్మకి.
ఆ అమ్మాయి గురించి వాకబు చేశారు సీతమ్మ.
'టెస్టులు చేస్తున్నారండీ!' అన్న మాట విని, వెనక్కి తిరిగి చూస్తే ఆ పిల్లే.
'హమ్మయ్యా!' అనుకుని, వచ్చి నిశ్చింతగా కూర్చున్నారు సీతమ్మ ఓ కంట ఆ పిల్లను కనిపెడుతూనే.. నెమ్మదిగా రామయ్య టెస్టుల నుండి వచ్చారు.
'రిపోర్టులేవి?' అనడిగారు సీతమ్మ.
'మేం తెస్తాంలెండి' అన్నది ఆ పిల్ల.
'ఈ పిల్లకేవిటో ఇంత శ్రద్ధ?' అనుకున్నారు సీతమ్మ.
కాసేపటికి డాక్టర్‌ నుండి పిలుపొచ్చింది.
డాక్టర్‌ గారు రామయ్య చేతిలో మందుల చీటీ పెట్టారు.
'అదేవిటీ, రిపోర్టులు చూడరా?' అనడిగారు రామయ్య గోడ వైపు తిరిగి నిలబడి.
'అందులో ఏముంటుందో మా డాక్టర్‌ గారికి తెలిసిపోతుందిలెండి' అన్నాడు అసిస్టెంటు.
'అంతకాడికి టెస్టులెందుకు చేయించినట్లో?' అనుకున్నారు రామయ్య మందుల చీటీతో బైటకొస్తూ.
బైటకు రాగానే ఆ పిల్ల రామయ్య చేతిలో నుండి మందుల చీటీ తీసేసుకుని వెళ్ళిపోయింది. రామయ్య ఆ అమ్మాయి వెంటపడ్డారు.
మందులన్నీ ఒక చోట పేర్చి ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో వివరించి చెప్పింది ఆ పిల్ల.
ఆ మందులు పట్టుకుని ఇంటికి చేరారు దంపతులిద్దరు.
మందుల దారి మందులదే .. చెవిలో దురద అలాగే ఉంది రామయ్యకి.
ఈ గోల ఇలా ఉండగా లాక్‌డౌన్‌, కరోనా దెబ్బకు నెత్తిన పెరిగిన దుబ్బుని వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతో ఒక ఆదివారం రామయ్య సెలూన్ల వేటలో పడ్డారు. వెతగ్గా వెతగ్గా ఒకచోట ట్రిమ్మర్స్‌ అండ్‌ ట్రిమ్మర్స్‌ అనే సెలూన్‌ కనపడింది. 'మామూలు సెలూన్ల కంటే ఇదే మంచిది ఈ కాలంలో' అనుకుంటూ అందులోకి అడుగుపెట్టారు రామయ్య.
అక్కడ ఒక కుర్రాడు ఈయన్ని చూడగానే వచ్చి శానిటైజేషన్‌ వగైరాలన్నీ పూర్తిచేసి, పని మొదలుపెట్టాడు. అద్దంలో చూసుకుంటున్న రామయ్యతో ఆ కుర్రాడు 'సార్‌! మీకు చెవిలో దురదగా ఉంటుందా?' అనడిగాడు.
'ఈ కుర్రాడికెలా తెలిసిందబ్బా?' అనుకుంటూ అతడి వైపు చూశారు రామయ్య.
'ఏంలేద్సార్‌.. మీ చెవిలో సన్నటి వెంట్రుకలున్నాయి. వాటివల్ల ఇరిటేషన్‌ కలుగుతుంది. దురద పుడుతుంది. ఒక్క నిముషం ఉండండి.' అంటూ సన్నటి కత్తెర తీసుకుని, ఆ వెంట్రుకలను కత్తిరించేశాడు.
'ఇక నుండి మీరు అప్పుడప్పుడు చెవిలో కూడా వెంట్రుకలు కత్తిరించుకుంటూ ఉండండి. లేకుంటే చెవిలో దురద పుడుతుంది' అంటూ ఐదొందలు బిల్లు చేతిలో పెట్టాడు.
'వార్నీ, ఇదా ఇంతకాలం ఇబ్బంది పెట్టింది? ఈ సంగతి తెలీక వేల రూపాయలు తగలేశానే?' అనుకుంటూ
'చదివినోడికన్నా ఓరన్నా కత్తెరోడు మిన్న' అని పాడుకుంటూ ఇంటికి బయల్దేరారు రామయ్య.

- అధరాపురపు మురళీకృష్ణ
writer.amkrishna@gmail.com