Sep 12,2022 23:59

పాదయాత్ర చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : చెత్త పన్ను రద్దు చేయాలని, పెంచిన ఇంటి పన్నును తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన అగనంపూడి పరిధి దిబ్బపాలెం, శనివాడ, దానబోయనపాలెం గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచిపెట్టారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులపై ఉమ్మడిగా దాడిచేయడం మానుకోవాలని హితవు పలికారు. పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యావసరాలు, బస్సు, విద్యుత్‌ ఛార్జీల మోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఈ తరుణంలో కొత్తగా చెత్త పన్ను వేయడం, ఇళ్ల పన్నును పెంచడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అగనంపూడి జోన్‌ కమిటీ సభ్యులు యు.రామస్వామి, శాఖ కార్యదర్శి యు.మరిడయ్య, నాయకులు యు. కన్నారావు, నీలకంఠం, రమేష్‌, అబ్బాయి, అప్పలరాజు, నారాయణరావు ఆంజనేయులు, గణేష్‌, పూర్ణ, జయ తదితరులు పాల్గొన్నారు.