Sep 16,2022 23:39

పాదయాత్ర నిర్వహిస్తున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి- పెందుర్తి : ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్న పన్నుల భారాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, చెత్త పన్నును ఎవరూ చెల్లించవద్దని సిపిఎం పెందుర్తి జోన్‌ కార్యదర్శి బి.రమణి పిలుపునిచ్చారు. శుక్రవారం 94, 97వ వార్డుల పరిధిలోని చైతన్యనగర్‌, అప్పలనరసయ్య నగర్‌, వీర నగర్‌, గాంధీనగర్‌ కాలనీలలో చెత్త పన్ను ఎవరూ చెల్లించివద్దంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు .ఈ సందర్భంగా జోన్‌ కార్యదర్శి బి.రమణి మాట్లాడుతూ ఆయిల్‌, పాలు, నిత్యావసర ధరలపై జిఎస్‌టి మోత పేదలకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే చెత్త పన్ను చెల్లించవద్దంటూ వివిధ ప్రాంతాల్లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రలు, అవగాహన ర్యాలీలతో అనేక మంది ప్రజలు చైతన్యవంతులై చెత్తపన్ను చెల్లించడం లేదన్నారు. సిఐటియు నాయకులు అప్పలనాయుడు మాట్లాడుతూ సమస్యలేవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, అండగా ఉండి పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.