
పొగ వ్యాపించడంతో వెలగలేరు గ్రామస్తుల అవస్థలు
చర్యలు తీసుకోవాలని వేడుకోలు
ప్రజాశక్తి - పెనుమంట్ర
డంపింగ్ యార్డులో చెత్తకు నిప్పు పెట్టడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్టేరు గుణ్ణం చెరువు గట్టు పక్కన సంవత్సర కాలంగా పంచాయతీ సేకరించిన చెత్తాచెదారం వేస్తున్నారు. ఆ చెత్తకు నిప్పు అంటించినప్పుడల్లా సమీప గ్రామమైన వెలగలేరు వైపు పొగ కమ్ముకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో మార్టేరు డంపింగ్ యార్డు కోడేరు రోడ్డులోని శ్మశానవాటిక వద్దకు చేరవేసేవారు. శ్మశానవాటిక అభివృద్ధి చేసిన నేపథ్యంలో గ్రామంలో సేకరించిన చెత్త చెదారం వెలగలేరు సమీప ప్రాంతమైన మార్టేరు గుణ్ణం చెరువు గట్టుకు తరలిస్తున్నారు. అక్కడ తరచూ చెత్తకు నిప్పు పెట్టడంతో ఆ పొగ వెలగలేరు వైపునకు వచ్చి గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ కుమ్ముకున్నప్పుడల్లా ఊపిరాడడంలేదని వెలగలేరు గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడేవారు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను స్థానికులు మార్టేరు సర్పంచి మట్టా కుమారి, పంచాయతీ కార్యదర్శి కె.సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లినా రోజులు గడుస్తున్నాయే తప్ప సమస్య పరిష్కారం కావడంలేదని వాపోతున్నారు. గ్రామస్తులు వెలగలేరు పంచాయతీ కార్యదర్శి సుధారాణి వద్ద తమ గోడు వెలబెట్టుకున్నారు. ఈ విషయంపై మార్టేరు పంచాయతీ కార్యదర్శి కె.సత్యనారాయణను వివరణ కోరగా చెత్తాచెదారం ఏరుకునే వారు నిప్పు పెట్టే సందర్భంలో పొగ వ్యాపించి ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఇకపై చెత్తకు ఎవరూ నిప్పు పెట్టకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.