Jul 05,2023 00:08

మైనింగ్‌ ప్రదేశంలో ధర్నా చేస్తున్న పెదగార్లపాడు గ్రామస్తులు, సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - దాచేపల్లి : ఒకవైపు ఇళ్లు బీటలు వారుతుంటే మరోవైపు తమను మభ్యపెట్టేలా చెట్టినాడ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యవహరిస్తోందని మండలంలోని పెదగార్ల పాడు గ్రామస్తులు మండిపడ్డారు. ఫ్యాక్టరీ మైన్స్‌లో మంగళవారం ఆందోళన చేపట్టారు. అక్కడే వంటావార్పు చేశారు. 10 గంటల ఆందోళన, రెండు దఫాల చర్చల అనంతరం 15 రోజుల సమయం ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులు రాతపూర్వకంగా కోరడంతో అందుకు అంగీకరించి ఆందోళన విరమించారు.
చెట్టినాడు సిమెంటు ఫ్యాక్టరీ మైన్‌లో జరిగే పేలుళ్ల వల్ల తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని గ్రామస్తులు రెండేళ్లుగా ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై యాజమాన్యం, ప్రభుత్వ అధికారులకూ పలుమార్లు విన్నవించారు. అయినా సరైన స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల కిందట కంపెనీ ప్రతినిధులు గ్రామానికి వచ్చి ఒక్కో ఇంటికి 10 కట్టల సిమెంట్‌, ఇసుకను ఇస్తామని, వాటితో మరమ్మతు చేయించుకోవాలని చెప్పారు. ఇందుకు అంగీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేయాలన్నారు. అయితే ఆ పత్రాల్లో ఏముందు సరిగా చూడనివ్వకపోవడంతోపాటు ఫొటోలూ తీసుకోనివ్వలేదు. కంపెనీ ప్రతిపాదనలను గ్రామస్తులు తిరస్కరించారు. నిపుణులను పిలిపించి పరిష్కారం కనుగొనాలని, ఇళ్లు బీటలు వారకుండా వారి సూచనలతో కొత్తగా ఇళ్లను నిర్మించాలని, లేకుంటే మరో ప్రదేశంలో కొత్తగా ఇళ్లు కట్టించాలని డిమాండ్‌ చేశారు. ఇదే అంశాలపై కంపెనీ మైన్స్‌ ప్రాంతంలో మంగళవారం ఉదయం 11 గంటలకు సిపిఎం ఆధ్వర్యంలో 150 మందికి పైగా గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గంట తర్వాత యాజమాన్య ప్రతినిధులు చర్చలకు ఆహ్వానించారు. అయితే అవి ఫలించకపోవడంతో ఆందోళన కొనసాగింది. గ్రామస్తులు అక్కడే భోజనాలు వండుకున్నారు. తమ సమస్యకు సరైన పరిష్కారం చూపేవరకూ ఉద్యమిస్తామని ఖరాఖండీగా చెప్పారు. దీంతో సాయంత్రం 6 గంటలకు మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ ఇల్లకు బీటలు రావడానికి పేలుళ్లు కారణం కాదని, దీనిపై తాము నిపుణులతోనూ పరిశీలన చేయించగా వారూ ఇదే నివేదించారని అన్నారు. దీనికి గ్రామస్తులు స్పందిస్తూ పేలుళ్ల సందర్భంలో కంపెనీ వారు వచ్చి తమ ఇళ్లల్లో కూర్చోవాలని, అప్పుడు తమ ఇళ్లల్లోని సామాన్లు కింద పడుతున్నాయో లేదో, కంపనలు వస్తున్నాయో లేదో చూసుకోవాలని అన్నారు. నిపుణుల కమిటీ ఏమి నివేదించిందో తమకు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ కంపెనీ జనరల్‌ మేనేజర్‌తో తాము మాట్లాడతామని, 15 రోజుల సమయం కావాలని రాతపూర్వకంగా అడిగారు. ఇందుకు గ్రామస్తులు అంగీకరించారు. 15 రోజుల తర్వాత సరైన న్యాయం చేయకుంటే ఆందోళలనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, నాయకులు ఆంజనేయరాజు, కె.సాయి, జె.వెంకటేశ్వర్లు, కె.సాంబయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.