ప్రజాశక్తి -గాజువాక : జివిఎంసి ఆధ్వర్యాన తక్షణమే చెత్త సేకరణ చేపట్టాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు హెచ్చరించారు. చెత్త పన్ను చెల్లించాలని జివిఎంసి గాజువాక జోన్ అధికారుల బెదిరింపులకు నిరసనగా తోకాడలోని సమైక్య, సిరి, గ్రీన్ లైఫ్ అపార్ట్‌మెంట్ల ప్రజలు గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు గంగారావు హాజరై మాట్లాడారు. చెత్తను తరలించకుండా ఉంచడం చట్ట వ్యతిరేకమన్నారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న చెత్తను తీసుకెళ్లకపోతే జివిఎంసి కార్యాలయం వద్ద, వార్డు కార్పొరేటర్ ఇంటి ముందు చెత్తను వేసి నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్, విశాఖ ఎంపీ ఎంవివి.సత్యనారాయణ ఈ చెత్త సమస్యపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు పథకాలను నిలుపుదల చేస్తామని భయభ్రాంతులకు గురిచేసి చెత్త పన్ను వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారులు ఎంత బెదిరించినప్పటికీ 30 శాతం ప్రజలు మాత్రమే చెల్లించారని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే చెత్త పన్నుపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తెలుస్తోందన్నారు. చెత్త పన్ను వసూలు చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు. చెత్తపన్ను పేరుతో బెదిరింపులకు పాల్పడితే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన చెత్త వాహనాలకు నెలకు రూ.65 వేలు చెల్లించాలని, వాటి నిర్వహణను జగన్మోహన్‌రెడ్డి అనుచరులకు కట్టబెట్టారని, వసూలు చేసిన చెత్త పన్ను ఆయనకి చెల్లిస్తున్నారని తెలిపారు.
సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు మాట్లాడుతూ, అదాని గంగవరం పోర్టు నుంచి ట్యాక్స్ వసూలు చేయకుండా వారికి రాయితీలిచ్చి ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తోకాడ సమైక్య అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తమ అపార్ట్‌మెంట్ నుంచి రూ.6 లక్షల పన్ను చెల్లిస్తున్నామని, ఇది చాలదని చెత్త పన్ను కూడా కట్టాలని జోనల్ కమిషనర్ స్థాయి అధికారి అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చి వీధి రౌడీలా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. చెత్తను రోజూ తీసుకువెళ్లే విధంగా చూడాలని కోరారు. గ్రీన్ లైఫ్ అపార్ట్‌మెంట్ ప్రతినిధులు నారాయణ రావు, బి.దేవ్ మాట్లాడుతూ, చెత్త పన్నుపై కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అంతవరకు చెల్లించబోమని స్పష్టంచేశారు. సిరి అపార్ట్‌మెంట్ ప్రతినిధి వాసు మాట్లాడుతూ, చెత్త పన్నుపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ ధర్నాలో వార్వా, నివాస్ నాయకులు త్రినాథ్‌స్వామి, తోకాడ సమైక్య అపార్ట్‌మెంట్ నాయకులు తవిటయ్య, తౌడన్న, రమణ, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్త పన్ను రద్దు చేయాలని నినదించారు. అనంతరం ఎఎమ్‌హెచ్‌ఒ డాక్టర్ కిరణ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన ఎఎంహెచ్‌ఒ చెత్తను తొలగిస్తామని హామీ ఇచ్చారు.










