Jun 12,2023 00:19

సభలో మాట్లాడుతున్న వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - గాజువాక : చెత్త పన్నుపై మరింత ఉధృతంగా పోరాటం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చాలా కాలం సిపిఎం పోరాటాల్లో పాల్గొని ప్రస్తుతం గాజువాక పరిధి తోకాడ సమైక్య అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న కొల్లి సత్యనారాయణ మాస్టారును పరామర్శించేందుకు శ్రీనివాసరావు ఆదివారం వచ్చారు. 'ఎలా ఉన్నారు మాస్టారూ' అని పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపార్టుమెంట్‌లో ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ చెత్త పన్నుపై సమైక్య అపార్టుమెంట్‌ వాసులు చుట్టుపక్కల ఉన్న అపార్టుమెంట్ల వారిని కలుపుకుని పోరాడాలన్నారు. విజయవాడలో అందరూ ఐక్యంగా ఉంటూ చెత్త పన్ను కట్టని విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలోనూ 12 డివిజన్లలో చెత్త పన్ను కట్టలేదని తెలిపారు. పెన్షన్‌ ఆపుతామని బెదిరింపులు దిగినా పేదలు, పట్టణ వాసులు చాలా ఏరియాల్లో ప్రభుత్వంపై తిరగబడటంతో సర్కారు వెనక్కు తగ్గిందన్నారు. చెత్త పన్ను ప్రపంచ బ్యాంకు షరతుల్లో భాగమేనన్నారు. కరెంట్‌ బిల్లులు గత నెలతో పోలిస్తే దారుణంగా ఈ నెల పెరిగాయన్నారు. విద్యుత్‌ ఛార్జీల మోతనూ ప్రతిఘటించాలన్నారు. సమైక్య అపార్టుమెంట్‌ నాయకులు బి.తౌడన్న అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, అపార్టుమెంట్‌ నాయకులు చిన్నం నాయుడు, చౌదరి, రమణ, రామన్న, స్వప్న, మణి, పద్మ, హేమలత పాల్గొన్నారు.