సిపిఎం ఆధ్వర్యాన ర్యాలీ
ప్రజాశక్తి -తగరపువలస జివిఎంసి పరిధిలో ప్రజలపై విధించిన చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం భీమిలి జోన్ ఆధ్వర్యంలో బుధవారం ఒకటో వార్డు బంగ్లా మెట్టలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ, ఇంటి పన్నుతో కలిపి చెత్త పన్ను చెల్లించేలా జివిఎంసి పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరమని, ప్రజా వ్యతిరేకమని స్పష్టం చేశారు. చెత్త పన్ను విధింపుపై ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను గుర్తించకుండా, అధికారమదంతో వైసిపి కార్పొరేటరు అడ్డుదోవలో ఇలా ప్రజలపై భారం మోపడం దుర్మార్గమని విమర్శించారు. దీన్ని జివిఎంసి కౌన్సిల్‌లో సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించినా, అధికార బలంతో వైసిపి తీర్మానం ఆమోదింపజేసి అమలు చేస్తోందని మండిపడ్డారు. ర్యాలీలో సిపిఎం మండల కార్యదర్శి రవ్వ నరసింగరావు, నాయకులు ఎస్ అప్పలనాయుడు, బాబాజీ, ఇంటి రాంబాబు, నరసింహమూర్తి పాల్గొన్నారు.










