Aug 27,2022 23:05

ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- కంచరపాలెం : చెత్త పన్నును వెంటనే రద్దు చెయ్యాలని, ఆస్తి పన్నుకు చెత్త పన్ను లింక్‌ పెట్టొద్దని కంచరపాలెం పరిధి రవీంద్రనగర్‌లో సిపిఎం ఆధ్వర్యాన పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, చెత్తకు పన్ను వేయడమే దుర్మార్గమన్నారు. దాన్ని రద్దుచెయ్యకపోగా ఆస్తిపన్నులో కలిపి కట్టాలని ఈ ప్రభుత్వం నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటుతుంటే.. ఇవి సరిపోవని కార్పొరేషన్‌ కూడా పన్నులు వేసి ప్రజల్ని మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని విమర్శించారు. వెంటనే చెత్త పన్ను రద్దు చేయకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జోన్‌ కార్యదర్శి బి.ఈశ్వరమ్మ, ఎ.పుష్ప, సిహెచ్‌.కమల, ఎం.జయలక్ష్మి, కె.అనూరాధ తదితరులు పాల్గొన్నారు.