Aug 30,2022 23:10

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న బలివాడ వెంకటరావు

ప్రజాశక్తి -గోపాలపట్నం : చెత్త పన్ను చెల్లించకపోతే నిరుపేదల పింఛన్లు ఆపేయడం దారుణమని సిపిఎం గోపాలపట్నం జోన్‌ కార్యదర్శి బలివాడ వెంకటరావు పేర్కొన్నారు. గోపాలపట్నం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి చెత్త పన్ను కట్టకపోతే పింఛన్‌ రాదని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇటువంటి సంఘటనలు గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం, ఎన్‌ఎడి కొత్త రోడ్డు, విమాన నగర్‌, కొత్తపాలెం పరిధిలో చోటుచేసుకున్నాయని వివరించారు. చెత్త పన్నుపై కోర్టులో కేసు ఉందని గుర్తు చేశారు. చాలామంది నిరుపేదలు పన్నులు చెల్లించడానికి ఇక్కట్లు పడుతున్నారన్నారు. వాలంటీర్లు ఈ బెదిరింపు చర్యలను మానుకోకపోతే సిపిఎం తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.