
ప్రజాశక్తి-గన్నవరం : చెత్త డంపింగ్ యార్డ్‌కు స్థలం సేకరించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం శివాలయం వద్ద నిరసన కార్యక్రమం, సంతకాల సేకరణ జరిగింది. గన్నవరం పట్టణంలో సేకరించిన చెత్తను ఆగిరిపల్లి రోడ్డులో ఇరువైపులా వేయడం వల్ల దాని నుంచి వచ్చే దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు కాట్రగడ్డ జోషి మాట్లాడుతూ చెత్త డంపింగ్‌కు స్థలం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించడం వల్ల చెత్త సమస్య గన్నవరాన్ని పట్టిపీడిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు మల్లంపల్లి ఆంజనేయులు, అనుమోలు వెంకటేశ్వరరావు, ఉదయ భాస్కరరావు, మిరప నాగేశ్వరరావు, జాస్తి శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, ఉడత రామకష్ణ, సాంబశివరావు పాల్గొన్నారు.