Oct 14,2022 23:48

విశాఖ-భద్రాచలం ప్రధాన రహదారిలోని గోతుల్లో చేరిన నీటిలో సేద తీరుతున్న గేదెలు

ప్రజాశక్తి- సీలేరు
ఈ ఫొటోను చూసి గేదెలు చెరువులో సేద తీరుతున్నాయి అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అది చెరువు కాదు. ప్రధాన రహదారిలో భారీ గోతులు. వర్షానికి ఆ గోతుల్లో నీరు చేరడంతో చెరువును తలపించేలా ఉండడంతో అందులో గేదెలు సేద తీరుతున్నాయి. జీకే వీధి మండలం సీలేరు జల విద్యుత్‌ కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు ఆ గోతుల్లో చేరింది. దీంతో వాహనచోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నం నుంచి సీలేరు మీదగా భద్రాచలం వెళ్లడానికి బస్‌ సర్వీసులకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు. తాత్కాలిక మరమ్మతులు కూడా చింతపల్లి ఆర్‌ అండ్‌ బి అధికారులు చేపట్టలేదు. సీలేరు నుంచి ఆర్‌వి నగర్‌ వరకు ప్రధాన రహదారి గోతులమయమై వర్షపు నీరు చేరి ప్రాణాంతకంగా ఉంది. రాత్రి తిరిగే బస్‌ సర్వీసులలో ప్రయాణికులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఈ ప్రాంత ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్‌ అండ్‌ బి అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి ప్రధాన రహదారిలో గోతులు పూడ్చి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.