ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: రానున్న వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఇంకొల్లు నాగుల చెరువును పూర్తి స్థాయిలో నింపుతామని ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ సతీష్ వివరించారు. ప్రతి ఏటా పర్చూరు రోడ్డులోని మార్కెట్‌యార్డు ప్రక్కన ఉన్న నాగార్జున సాగర్ కాలువ నుంచి 12 ట్రాక్టర్ల ద్వారా నీటిని పంపింగ్ చేసేవారు. పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాల మేరకు 4 హైస్పీడ్ విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని మళ్లిస్తున్నామన్నారు. మరో 2 మోటార్లు తీసుకువచ్చి వేగవంతంగా నీరు తరలించే ప్రక్రియ చేపడతామని సతీష్ వివరించారు. ప్రాధాన్యత క్రమంలో మిగిలిన గ్రామాల్లో చెరువులను కూడా పూర్తి స్థాయిలో నింపి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని సతీష్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్‌డబ్ల్యుఎస్ ఏఇ పి జ్యోతి, ఉప సర్పంచ్ సయ్యద్ లతీఫ్, వార్డు సభ్యులు షేక్ మాలిక్ తదితరులు ఉన్నారు.










