ప్రజాశక్తి - కారంపూడి : తాగు అవసరాల కోసమని సాగర్ కుడి కాల్వ ద్వారా విడుదల చేసిన నీటిని చెరువులకు పెట్టడంలో క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. మండలంలోని ఒప్పిచర్లలో ఎర్ర చెరువు, నల్లచెరువులు ఉండగా వాటికి నీటిని పెట్టకుండా మట్టిని తవ్వుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మండల కేంద్రమైన కారంపూడిలోని చెరువులకు నీరు రావడం లేదు. పెద్దకొదమగుండ్ల మేజర్ పరిధిలో చెరువులు, కుంటలకు ఇంకా నీరు చేరలేదు. ఎండిపోయి ఉన్న నాగులేరుకు ఎస్కేప్ ఛానల్ ద్వారా కొద్ది నీరు చేరింది. వర్షాల్లేకపోవడం, ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటాయి. కొన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో విడుదలైన నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సైతం చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఈ జాగ్రత్తలు కనిపించడం లేదు.










