ప్రజాశక్తి - పెదనందిపాడు : కాలేజీకి వెళ్లాల్సిన రోజునే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని రావిపాడులో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రావిపాడుకు చెందిన కోటపాటి పవిత్ర (20) చలపతి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం పూర్తిచేసుకుంది. రెండో సంవత్సరం తరగతులకు సోమవారం నుండి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర తర్వాత ఆమె కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెదుకులాట ప్రారంభించడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులూ గ్రామానికి చేరుకుని గాలింపు చేపట్టారు. మృతురాలి ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి వాటి సిగల్‌ను పరిశీలించగా ఫోన్ స్థానిక చెరువు కట్ట మీద ఉన్నట్లు గుర్తించి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఫోన్ ఉండడంతో చెరువులో పరిశీలించగా ఆమె మృతదేహం కనిపించింది. దీంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందో తమకూ అర్థం కావడం లేదని, చదువులోనూ పవిత్ర బాగానే రాణించేదని కుటుంబీకులు చెబుతున్నారు. వారి ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి తల్లిదండ్రులతోపాటు ఇంటర్ చదివే తమ్ముడు ఉన్నాడు.










