Jul 02,2023 21:01

దెబ్బ తిన్న రోడ్లను పరిశీలిస్తున్న తులసిరెడ్డి

వేంపల్లె : ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని రోడ్లు చెరువులు, బావులను తలపిస్తున్నాయని పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం వేంపల్లెలోని పులివెందుల రోడ్డులో దెబ్బతిన్న రోడ్లను కాంగ్రెస్‌ నాయకులతో కలిసి తులసిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేంపల్లెలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద 6నెలలుగా రోడ్డు బాగా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయన్నారు. వాహనాలు నీటి గుంతల్లో పడి దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. పాదచారుల దుస్తులపై బురద నీరు పడుతోందన్నారు. రోడ్డు వెడల్పు రెండేళ్లుగా తెలుగు సీరియల్‌లా సాగుతోందన్నారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు, రోడ్లు వెడల్పు, అండర్‌ గ్రౌండ్‌ పనులు చేపట్టాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సుబ్రమణ్యం, రామకృష్ణ, ఉత్తన్న, అమర్‌, నరసింహారెడ్డి, బద్రి, వెంకటేష్‌, శివ, రాఘవయ్య, డాక్టర్‌ సుబ్బారెడ్డి, మాజీ గండి దేవస్థానం చైర్మన్‌ రమణ పాల్గొన్నారు.