
సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతరు
ప్రజాశక్తి - ఆకివీడు
చెరువులు అడ్డంగా పూడ్చేస్తున్నారు. ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణాలు సాగించడం విడ్డూరం. చట్టాలు చేయాల్సిన ప్రభుత్వమే ఆ చట్టాల్ని విసిరేస్తుంటే ఇంకా సామాన్యుడు ఎలా లెక్క చేస్తాడు. అదే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతోంది. మండలంలోని అజ్జమూరు గ్రామం గరువుపై ఉన్న భోగం చెరువును పూడ్చి గ్రామ సచివాలయానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్ర కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. దాతల ఆశయాన్ని ఇక్కడ తుంగలో తొక్కారు. సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేశారు. మంచినీటి చెరువులు, కాలువలు, నదులు, నీటి గుంటలు గాని ఏ రకంగానూ పుడ్చకూడదన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు. భవిష్యత్తులో పెరుగుతున్న ప్రజల అవసరాల మేరకు మంచినీటి కుంటలు పెంచడం సాధ్యమయ్యే విషయం కాదని, ఆ మేరకు ముందు జాగ్రత్తలు అవసరమని కోర్టు నిర్దేశించింది. ఆ మేరకు ప్రభుత్వం చట్టం చేయాలని ఏనాడో ఆదేశించింది. ఈ ఆదేశాన్ని తుంగలో తొక్కుతూ సాక్షాత్తు అధికారులే చెరువుల నిర్మాణాలు సాగిస్తుంటే ఇక ఆపేదెవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు వేశ్యా వృత్తికి అంకితమైనటువంటి వారు గ్రామంలో ఊరికి చివరగా నివసిస్తూ ఉండేవారు. మంచినీరు సైతం అందక ఒకనాడు వారు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అటువంటి వారి సంరక్షణ కోసం ఎంతో దాతృత్వంతో సహకారం అందించారు నాటి దాతలు. వారికి మంచినీటి సౌకర్యం కోసం తమ భూములను ఈనాంగా ఇచ్చారు. అయితే ఆనాడు నోటి మాటే కాగితం కన్నా విలువైనటువంటిది అవడంతో మాటిచ్చారు గాని, కాగితాలు లేవు. ఆ మార్గంలోనే ఆకివీడు నుంచి భీమవరం వెళ్లే మార్గమధ్యలో అజ్జమూరు గరువు పైన భోగం వృత్తి వారల కోసం ప్రత్యేకించి ఒక చెరువు ఏర్పాటైంది. అదే భోగం చెరువుగా నేటి వరకు పిలుస్తూ ఉన్నారు. అయితే కాలం మార్పుల రీత్యా ఈ భోగం చెరువు వాడకం తగ్గి వినియోగం లేకుండా పోయింది. ఫలితంగా ప్రభుత్వం ఈ చెరువును బాగు చేసి పునరుద్ధరించాల్సింది పోయి పూడ్చి నిర్మాణాలు చేపడుతుంది. అప్పటికే స్థానికులు కొంతమంది అడ్డుకోవడంతో కొంతకాలం నిర్మాణం ఆగింది. కాగా సుమారు రెండు శతాబ్దాల నుంచి చెరువుగా ఉంది.