నివాసితులు ఇబ్బందులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - ముదినేపల్లి
మందుబాబులకు ఆవాసాలుగా మంచినీటి చెరువుగట్లు మారుతున్నాయి. మందుబాబులు మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి తమకు అనుకూలంగా, సౌకర్యవంతంగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని అక్కడ సిట్టింగ్ వేసి మద్యం తీసుకుంటూ నానా యాగీ చేస్తున్నారు. ఇందుకు ఆవాసాలుగా ఆయా గ్రామాల్లోని మంచినీటి చెరువుగట్లను ఎంచుకుని తమ కార్యకలాపాలు జోరుగా సాగిస్తున్నారు. ఈ పరిస్థితి మద్యం దుకాణాలు ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతిచోట కనబడుతోంది. ముదినేపల్లిలోని జిన్నాబాబు రైస్ మిల్లు సమీపంలో ఉన్న మద్యం దుకాణం నుంచి కొనుగోలు చేసిన మందును దుకాణానికి దగ్గరలో ఉన్న మంచినీటి చెరువుగట్టుపైకి తీసుకెళ్లి అక్కడ మందుబాబులు ఫూటుగా మద్యం తాగుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిత్యం మద్యం తాగుతుండడంతో చెరువు గట్టు అంతా బీరు, మద్యం సీసాలతో నిండిపోయింది. తాగిన మద్యం సీసాలను మందుబాబులు అక్కడ వదిలేస్తున్నారు. దీంతో మద్యం సీసాలతో, గ్లాసులతో చెరువుగట్టు దర్శనమిస్తోంది. మంచినీటి చెరువుగట్టును ఆనుకుని నివాసితులు ఉన్నారు. మందుబాబుల చేష్టలు, కేకలతో విసుగెత్తిన నివాసితులు వారిని మందలిచడంతో తరుచూ నివాసితులకు, మందుబాబులకు గొడవలు జరుగుతున్నాయి. చెరువుగట్టుపై మద్యం తాగరాదంటూ ఎంత చెప్పినా మందుబాబులు వినడంలేదంటూ నివాసితులు చెబుతున్నారు. ''మా ఇష్టాం మేము ఇక్కడే తాగుతాం'' అంటూ ఎదురుదాడి చేస్తున్నట్లు నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయమై పలుసార్లు ట్యాంకు ఆపరేటర్‌కు, పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదంటూ స్థానికులు వాపోతున్నారు. చెరువు గట్టుపై ఇంతా జరుగుతున్నా సదరు ట్యాంక్ ఆపరేటర్ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో విచ్చలవిడిగా మద్యం తాగుతూ మందుబాబులు వీరంగం చేస్తున్నారు.
గ్రామాల్లో కాల్వగట్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల భవనాలను, మామిడి, కొబ్బరి తోటలు, కల్వర్టులు, బస్‌షెల్టర్లు, అసంపూర్తిగా ఉన్న జగనన్న లేఆవుట్లను మందుబాబులు తమ కార్యకలాపాలకు అడ్డగా మార్చుకుంటున్నారు. దీంతో ఆయా చోట్ల అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. తెల్లవారేసరికి అంగన్‌వాడీ, పాఠశాలాల ఆవరణాల్లో మద్యం సీసాలు, గ్లాసులు దర్శనమిస్తున్నాయి. దీంతో అంగన్‌వాడీ, పాఠశాలాల సిబ్బంది వాటిని తొలగించేందుకు ఇబ్బంది పడుతున్నారు. మద్యం సీసాలు, గ్లాసులతో తాము తీవ్ర అవస్థలు పడుతున్నట్లు అంగన్‌వాడీ, పాఠశాలాల సిబ్బంది చెబుతున్నారు. సరస్వతీ నిలయాలను కూడా మందుబాబులు తమ ఆవాసాలుగా మార్చుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధితాధికారులు, పోలీసులు నిఘా వేసి అసాంఘిక కార్యకలాపాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.










