ప్రజాశక్తి -తగరపువలస : రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు స్థానిక జాతీయ రహదారి, సంగివలస సర్వీస్ రోడ్డు, విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మురుగు నీరు నిల్చిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఇక్కడి దృశ్యం చిన్న పాటి చెరువును తలపించేలా ఉంది. వర్షం ఎప్పుడు కురిసినా సరే ఈ సమస్య ఇక్కడ పునరావృతమవుతూనే ఉంది. హైవే నిర్మాణ సమయంలోనే చక్కని ప్రణాళికతో ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
వర్షపు నీటిని తొలగించాలి : టిడిపి
సంగివలస విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వర్షపు నీటిని వెంటనే తొలగించేలా సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని టిడిపి నగర కార్యదర్శి పిట్ట సురేష్ సోమ వారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వర్షానికి రోడ్డుపై నిలిచిన నీటిని కూడా తొలగించలేని నిస్సహాయ స్థితిలో అధికార యంత్రాంగం ఉందని వాపోయారు. రోడ్డుకు ఇరువైపులా కాల్వలు, అవుట్ ఫ్లో నిర్మిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు.










