ప్రజాశక్తి- సబ్బవరం
మండలంలోని బంగారమ్మపాలెం పంచాయతీ పరిధి సర్వే నెంబర్ 49, 50, 51లో సుమారు 30 ఎకరాలు చెరువులో కొంత భూమిని ఆక్రమించిన వారిపై చెరువు ఆయకట్టు రైతులు 200 మంది గురువారం తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. ఈ చెరువును ఆనుకొని దాడి శ్రీరామ్మూర్తి కుమారులు దాడి ఉమామహేష్, దాడి తేజకు సుమారు 8 ఎకరాలు జిరాయితీ భూమి ఉందని, గురువారం వీరు తమ భూమితో పాటు పక్కనే ఉన్న చెరువు గర్భంలో గల తాటి చెట్లు తీసివేసి ఆక్రమణకు పాల్పడ్డారని, దీనిని దాడి శ్రీరామ్మూర్తి, కన్నంనాయుడు ప్రోత్సస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాతల కాలం నుండి ఈ చెరువు నీటితో భూములను సాగుచేసుకొని జీవనోపాధి పొందుతున్నామని, ఇప్పుడు చెరువు గర్భం ఆక్రమించడంతో సాగునీరు అందే పరిస్థితి ఉండదని, తమకు న్యాయం చేయాలని కోరారు.
దీనికి స్పందించిన తహశీల్దార్ ఇరు వర్గాల రైతులకు ఉన్న అధికారిక భూ పత్రాలు పరిశీలించి తగిన విధంగా న్యాయం చేయాలని తమ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆర్‌ఐ వీరయ్య, ఇరిగేషన్ ఎఇ రామ లక్ష్మణ ఆక్రమణకు గురైన చెరువు గర్భాన్ని పరిశీలించి ఆక్రమణలను నిలవరించారు. జెసిబితో చెరువు గర్భానికి వెళ్లే నీటి కాలువలను సరిచేసి గట్లు వేశారు. చెరువు హద్దులు గుర్తించి సరిహద్దు రాళ్లు వేస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా దాడి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ తన జరాయితీ భూమితో పాటు పక్కనే ఉన్న చెరువు గర్భంలో కొంత భాగం కొన్నేళ్లుగా తన ఆధీనంలో ఉందని, దానిలో ఉన్న మొక్కలను తొలగించానని చెప్పారు. తాను చెరువు గర్భాన్ని ఆక్రమించలేదని, తన ఆధీనంలో ఉన్న భూమిని మాత్రమే చదును చేశానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దాడి లావణ్య కన్నం నాయుడు, మాజీ ఎంపీటీసీ దొడ్డి అరుణ సూర్య ప్రకాష్, సూరిశెట్టి రమణ, రాజ్ కోటి తదితరులు పాల్గొన్నారు.










