Jun 24,2023 01:48
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, రాజకీయ నాయకులు

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ఉప్పాల అమర్నాథ్‌ హత్య కేసులో నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా త్వరగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్‌ మణిలాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉప్పాల అమర్నాథ్‌ మృతి నేపథ్యంలో నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ ద్వారా కఠినంగా శిక్షించాలంటూ మండల పరిధిలోని బీసీ సంఘాలు, ప్రజాసంఘాల నేతృత్వంలో నిర్వహించిన బహిరంగ సభలో బాపట్ల జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు మణిలాల్‌ మాట్లాడుతూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని, సాక్షాత్తు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రెండు కుటుంబాల మధ్య తగాదా అని చెబుతున్నారని, కానీ వారి కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు లేవని, తన సోదరిని వేధించవద్దు అన్నందుకు అభం శుభం తెలియని పదో తరగతి విద్యార్థిని చేతులు కాళ్లు కట్టివేసి పాశవికంగా పెట్రోల్‌ పోసి హత్య చేయడం నేటి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే నిందితులకు కఠినంగా అతి త్వరగా శిక్ష విధించాలని, జస్టిస్‌ వర్మ సిఫార్సుల మేరకు 45 రోజులలో విచారణ పూర్తి చేసి శిక్ష విధించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు దివి రాంబాబు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పీ మనోజ్‌ కుమార్‌, సిపిఎం చెరుకుపల్లి మండల కార్యదర్శి కే శరత్‌, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మల్లాది రామకృష్ణ, మీర్జా అజీముద్దీన్‌, కందుల వెంకటేశ్వరరావు తదితరులు, పలువురు బీసీ సంఘాల నేతలు, అమర్నాథ్‌ కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు.