
ప్రజాశక్తి-చోడవరం
చోడవరం సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులకు వెంబనే బకాయిలు చెల్లించాలని, సుగర్ ఫ్యాక్టరీని ఆధునికీకరించాలని, కనీసం మద్దతు ధర టన్నుకు రూ.5000 ప్రకటించాలని కోరుతూ ఎపి చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ వద్ద రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. అనంతరం సుగర్ ఫ్యాక్టరీ ఎండి వి.సన్యాసినాయులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి అప్పారావు మాట్లాడుతూ చోడవరం సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 2022-23 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి చెరుకు రైతులకు సుమారు రూ.72 కోట్ల బకాయిలు ఉండగా, వాటిని ఇంతవరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి చెరుకు పండించారని, ఫ్యాక్టరీ నిబంధన ప్రకారం చెరుకు తోలిన 14 రోజుల్లోగా పేమెంట్ చేయవలసి ఉన్నా ప్రభుత్వం నెలల తరబడి బకాయిలు చెల్లించడం పోవడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. ఫ్యాక్టరీని ఆధునికీకరిస్తామని, ఇతనాలు యూనిట్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ అమలుకు ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఫ్యాక్టరీని ఆధునికీకరించకపోవడం వలన క్రషింగ్ సామర్థ్యం తగ్గిపోయి ఇతర జిల్లాలకు చెరుకు తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన రేటుకు అదనంగా పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రోత్సాహంగా టన్నుకు రూ.400 నుండి రూ.600 చెల్లిస్తున్నాయని, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం రూ.400 చెల్లించాలని డిమాండ్ చేశారు. సోమనాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధర రూ.5000 ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన బాబు, సహాయ కార్యదర్శి ఎస్వీ నాయుడు, ఫ్యాక్టరీ కమిటీ కార్యదర్శి వి.సూర్యనారాయణ అధ్యక్షులు కంటమరెడ్డి నరసింహులు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు జరగడం అప్పారావు, పేర్ల రామప్ప నాయుడు, బోను దేవుళ్ళు తదితరులు పాల్గొన్నారు.