
ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి చెర్లోపలి ల్యాండ్ పూలింగ్ పూర్తి చేయడానికి చర్యలు తీసుకొని రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని అనకాపల్లి వ్యవసాయదార్ల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జునకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైతులతో శనివారం కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించారు. రైతులు విఎంఆర్‌డిఎ వారికి 2007 నుండి జిపిఎ రిజిస్ట్రేషన్లు చేసి 61:39 శాతంపై అప్పగించి ఉన్నారని, రైతులకు అగ్రిమెంట్ ప్రకారం ఎకరాకు 1800 గజాలు చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్లు అందించవలసి ఉందని పేర్కొన్నారు. 55 ఎకరాల ల్యాండ్ పూలింగ్ భూముల్లో సుమారు రూ.కోటి 76 లక్షలతో రోడ్డు, కాలువలు నిర్మాణం చేశారని, కానీ లేఅవుట్ మాత్రం పూర్తిస్థాయిలో పూర్తి చేయలేదని పేర్కొన్నారు. దీనికి కలెక్టర్ బదులిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ రోజుల్లో సెంటుకి 18 గజాలు చొప్పున ఒప్పుకున్నప్పటికీ ఇప్పటి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సెంటుకు 18 గజాలు కాకుండా, రైతులు తమ వాటాను తగ్గించుకోవాలని కోరారు. 16 ఏళ్ల నుండి ఆ భూముల్లో పంటలు వేయనీయక పోవడంతో రాబడి లేక తాము నష్టపోయామని, నాటి భూమి విలువకు, నేటి విలువకు వ్యత్యాసం ఉన్నందువల్ల సెంటుకు 18 గజాలు కాకుండా హెచ్చుగా ఇప్పించాలని రైతులు అభ్యర్థించారు. చివరికి రైతులకు నష్టం లేకుండా వారు కోరిన పాత ఒప్పందం ప్రకారం ప్లాట్లు ఇవ్వడానికి కలెక్టర్ అంగీకరించారు. త్వరలోనే ల్యాండ్ పూలింగ్ చర్యలను మొదలుపెట్టి అందజేస్తామన్నారు. మిగిలిన రైతుల భూములను కూడా వుడాకు జీపీఏ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 80వ వార్డు వైసిపి కన్వీనర్ కొణతాల భాస్కరరావు, విల్లూరి రాము, బుద్ద రమణాజీ, కర్రి దివాకర్ రావు, భీశెట్టి కృష్ణ అప్పారావు, కాండ్రేగుల విశ్వేశ్వరరావు, కొణతాల భాస్కరరావు, కాండ్రేగుల సూరిఅప్పారావు, కాండ్రేగుల నూకరాజు, టి.జనార్ధనరావు, రైతులు పాల్గొన్నారు.