Dec 07,2022 23:41

చౌడువాడలో ఎర్రగా మారుతున్న చెరకు తోట

ప్రజాశక్తి- కె.కోటపాడు
చెరకు పంటకు తెగుళ్ల బెడద ఎక్కువైంది. మొక్క, రెండు మూడు జడలు దశల్లోనే తెగుళ్లు సోకి ఎర్రగా మారిపోయి తోటలు చచ్చిపోతున్నాయి. ఒక వైపు గిటుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాక సతమతమవుతుండగా, మరోవైపు తెగుళ్లతో చెరకు తోటలు ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కె.కోటపాడు మండలంలోని చౌడువాడ, మల్లంపాలెం, గుల్లేపల్లి, గొండుపాలెం, పైడంపేట, రొంగలినాయుడుపాలెం. మేడిచర్ల, ఎ.భీమవరం, కె.కోటపాడు, ఎ.కోడూరు, సూరెడ్డిపాలెం, వారాడతో పాటు మరికొన్ని గ్రామాల్లో 1750 హెక్టార్లలో ప్రస్తుతం రైతులు చెరకు సాగు చేస్తున్నారు. ఈ చెరకులో అత్యధిక భాగం చోడవరం (గోవాడ) చక్కెర కర్మాగారానికి సరఫరా చేస్తున్నారు. గతంలో పాతకొత్తతోట, 19, ఆబోతు, 7602, 7601 రకాల చెరకును రైతులు పండించేవారు. ఈ రకం చెరకు సుగర్‌ ఫ్యాక్టరీకి, బెల్లం తయారీకి లాభదాయకంగా ఉండేది. రైతులు 80 శాతం వరకు ఈ చెరకు సాగు చేసేవారు. అయితే ఈ రకాలకు తెగుళ్లు సోకి చచ్చిపోవడంతో చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీ స్వల్పకాల రకాలైన బూంది, బిస్కెట్‌ మొదలైన రకాల చెరకును మొదటిలో రైతులకు సబ్సిడీపై ఇచ్చి ప్రోత్సహించింది. ఈ రకాలు నాటిన ఆరు నెలలకే పక్వానికి వస్తున్నాయి. పాత రకాల చెరకు దిగుబడి కంటే 50శాతం వరకు తక్కువగా ఉన్నప్పటికీ వేగంగా పంట రావడంతో పాటు తెగుళ్లను తట్టుకుంటాయనే ఉద్దేశంతో రైతులు ఈ రకాల చెరకును సాగు చేస్తున్నారు.
అయితే రెండు సంవత్సరం నుండి ఈ రకాల చెరకు తోటలకు కూడా తెగుళ్లు సోకి చచ్చిపోతున్నాయి. కొన్నిచోట్ల నాటిన మొక్క నాటినట్లు ఉండిపోయి ఎర్రబారి, తరువాత చచ్చిపోతుండగా, మరికొన్నిచోట్ల రెండు మూడు జడలు వేసిన తర్వాత మడికి మడిలే చచ్చిపోతున్నాయి. ఈ విధంగా మండలంలో చౌడువాడలో ఇప్పటికే 25 శాతం వరకు చెరకు తోటలు తెగుళ్లు బారిన పడి ఎండిపోయాయి. రైతులు సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులు వాడినప్పటికీ ఈ చెరకు తోటల్లో ఎదుగుదల కనిపించలేదు. తెగుళ్లు నివారణ కావడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బెల్లానికి ధర లేక, చోడవరం చక్కెర కర్మాగారానికి సరఫరా చేసిన చెరకుకు మద్దతు ధర లభించక, సకాలంలో పేమెంట్లు ఇవ్వక ఇబ్బందులు పడుతున్న రైతులు, తాజాగా చెరకు తోటలు చచ్చిపోతుండడంతో ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. తెగుళ్లు సోకి చెరకు తోటలు చచ్చిపోతున్నా అటు చోడవరం చక్కెర కర్మాగారంగాని, ఇటు ప్రభుత్వంగాని తెగుళ్లు నివారణకు ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో చెరకు సాగు పట్ల రైతులు అనాసక్తి చూపిస్తున్నారు. గతంలో మండలంలో 3వేల హెక్టార్లో చెరకు సాగు చేయగా, ప్రస్తుతం 1750 హెక్టార్లకు దిగజారింది. ప్రతి ఏడాది చెరకు సాగు తగ్గిపోతూ వస్తోంది. ఇప్పటికైనా చెరకు పంటకు సోకిన తెగుళ్లపై వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరీక్షించి రైతులకు సరైన సూచనలు, సలహాలు అందించి చెరకు తోటలను క్రిమి కీటకాల బారి నుండి రక్షించాలని, ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.