
ప్రజాశక్తి- రేగిడి : చెరకు టన్ను మద్దతు ధర రూ 3,080లకు ఈ ఏడాది పెంచామని ఈనెల 30న చెరకు క్రషింగ్ ప్రారంభిస్తామని ఇఐడి ప్యారీ సుగర్స్ అసోసియేట్ సీనియర్ ఉపాధ్యక్షులు పట్టాభి రామ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సంకిలి ప్యారి సుగర్స్ కర్మాగారంలో స్థానిక విలేకరులతో ఆయన శుక్రవారం మాట్లాడారు. గతేడాది చెరకు టన్ను మద్దతు ధర రూ.2,980లు ఇవ్వగా ఈ ఏడాది వంద రూపాయలు పెంచుతూ 3,080 లకు పెంచినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 4.10 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ ఆడేందుకు యాజమాన్యం నిర్ణయించినట్లు వెల్లడించారు. గతేడాది 4.77 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ ఆడినట్లు వివరించారు. జిల్లాలో 2,564 ఎకరాల్లో మొక్క, 8,493 ఎకరాల్లో మమ్ము మొత్తం 11,057 ఎకరాలలో సాగు జరిగినట్లు పేర్కొన్నారు. కొత్తగా చెరుకు నాటిన రైతులకు భారీగా రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 2023-24 ఏడాదికి సంబంధించి అక్టోబర్ 2023 నుంచి 2024 సెప్టెంబర్ వరకు యాజమాన్యం సూచించిన రకాలు, చెరకు సాళ్ల మధ్య 4 అడుగులు దూరం నాటిన రైతులకు రూ.12,000 రాయితీ ఇస్తామన్నారు. 4 అడుగులు కంటే సాదా పద్ధతిలో నాటిన రైతులకు 11,000 రూపాయలు రాయితీ ఇస్తామన్నారు. మమ్ము పద్ధతిలో సాగు చేసే రైతులకు రూ.2500 రాయితీ ఇస్తామని వెల్లడించారు. మొక్క రాయితీ పొందడానికి రైతులు ఒక ఎకరం నుండి 30 టన్నులు చెరుకు సరఫరా చేయాలని వెల్లడించారు. అలా కానీ ఎడల 25 టన్నుల వరకు దామాస పద్ధతిలో రాయితీ వర్తిస్తుందన్నారు. 25 టన్నుల కంటే తక్కువ సరఫరా చేస్తే రాయితీ వర్తించదని స్పష్టం చేశారు. మమ్ము తోటలకు సంబంధించి ఒక ఎకరా నుంచి 25 టన్నులు చెరకు సరఫరా చేయాలన్నారు. కానీ ఎడల 20 టన్నుల వరకు దామాషా పద్ధతిలో రాయితీ వర్తిస్తుందన్నారు. 20 టన్నుల కంటే తగ్గిన రైతులకు రాయతీ వర్తిందన్నారు. జీడి, మామిడి తోటలను తొలగించి చెరుకు నాటిన రైతులకు అదనంగా ఎకరానికి రూ.5వేలు రాయితీ ఇస్తామన్నారు. యాజమాన్యం సూచించిన విత్తనాలు మాత్రమే నాటాలని కోరారు. ఇప్పటికే తుని, కర్ణాటక నుంచి 140 చెరకు నరుకు బంటాలను సిద్ధం చేశామన్నారు. సాళ్ల మధ్య దూరం నరుకుటకు 5 ఆధునూతన వాహనాలను రప్పించామన్నారు. రైతులు ఈ ఏడాది నాణ్యమైన చెరకు సరఫరా చేయాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా కటింగ్ ఆర్డర్లు ఆయా డివిజన్ కర్మాగార ఉద్యోగులను కలవాలన్నారు. వచ్చే ఏడాది చెరుకు విస్తరణ పెంచేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎవిపితో పాటు కేన్ ఎజిఎం రాజేంద్రన్, హెచ్ ఆర్ మేనేజర్ వి. మురళీకృష్ణ, ఫైనాన్సర్ మేనేజర్ పి శ్యామ్ కుమార్ ఉన్నారు.