Jul 08,2023 20:53

చెరకు సాగు చేస్తున్న రైతులు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  చెరకు రైతులకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా మూసివేసివేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఉత్పాదక వ్యయంతో సంబంధం లేకుండా క్వింటా చెరకుపై రూ.10 పెంచి, దాన్నే గొప్పగా చెప్పేసుకుంటోంది. దీంతో, చెరకు రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో మరోసారి మోసపోయినట్టైంది. రాష్ట్రంలో ఒకప్పుడు 5లక్షల ఎకరాల విస్తీర్ణంలో చెరకు సాగయ్యేది. సుమారు 29 సుగర్‌ ఫ్యాక్టరీల్లో క్రషింగ్‌ చేసేవారు. చెరకు సాగుకయ్యే పెట్టుబడులతో సంబంధం లేకుండా కేంద్రంలోని పాలకులు మద్ధతుధర నిర్ణయించడం, 2002లో అప్పటి సిఎం చంద్రబాబు చెరకు పాలసీని రూపొందించే స్టేట్‌ అడ్వైజరీ కమిటీని రద్దుచేయడం వంటి కారణాల వల్ల రైతులకు ఆర్థికంగా కుదేలవుతూవచ్చారు. దీంతో, క్రమంగా ప్రస్తుతం చెరకు విస్తీర్ణం క్రమంగా 1.50లక్షల ఎకరాలకు తగ్గింది. సామర్థానికి అనుగుణంగా చెరకు ఉత్పత్తులు లేకపోవడంతో చాలా వరకు చెక్కెర కర్మాగారాలు మర్మతులకు గురయ్యాయి. ఆధునీకరణ పేరుతో విజయనగరం జిల్లాలోని భీమసింగి విజయరామగజపతి సహకార చెక్కెర కర్మాగారం సహా పలు కర్మాగారాలను ప్రభుత్వాలే మూసివేశాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం జిల్లా సంకిలి సహా నాలుగు కర్మాగారాల్లో మాత్రమే చెరకు క్రషింగ్‌ జరుగుతోంది. ఈ సంగతి కాస్త అటుంచితే.... పెరిగిన పెట్టుబడుల ఆధారంగా క్వింటా చెరకుకు రూ.10చొప్పున మద్ధతు ధర కల్పించనున్నట్టు కేంద్ర మంత్రులు మన్‌సుజ్‌ మాండవ్యా, అనురాగ్‌సింగ్‌ ఠాగూర్‌ ఇటీవల ప్రకటించిన విషయం విధితమే. ఇందులో హేతుబద్ధత లేదని రైతులు, ఎపి రైతు సంఘం, చెరకు రైతుల సంఘం నాయకులు చెబుతున్నారు. మంత్రుల ప్రకటన ప్రకారం 2023-24 టన్ను క్రషింగ్‌ సీజన్‌లో టన్ను చెరకు రూ.3150 చొప్పున కొనుగోలు చేస్తారు. వాస్తవానికి ఇంతకు మించి రైతులకు పెట్టుబడులు అవుతున్నాయి. ఈ ధర నిర్ణయించే సమావేశంలోనే యూరియాపై రూ.24, పొటాష్‌, డిఎపి బస్తాలపై రూ.50చొప్పున పెంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం చేసింది. పెరిగిన డీజిల్‌ ధర వల్ల ట్రాక్టర్‌ అద్దె గతంతో పోలిస్తే రూ.200 పెరిగింది. కూలి రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ఈ లెక్కన ప్రాంతాలు, నీటి వసతులను బట్టి దుక్కి, విత్తనం, గొప్పులు, ఎరువులు, బోదులు కట్టడం, నీరుపెట్టడం, కూలి తదితర రూపాల్లో ఎకరాకు రూ.30వేల నుంచి రూ.60వేల వరకు పెట్టుబడి అవుతుంది. మరోవైపు రవాణా ఛార్జీలు కూడా గతంలో పోలిస్తే బాగా పెరిగిపోయాయి. వ్యవసాయ రుణాలపై ఆర్‌బిఐ 5శాతం వడ్డీ రేట్లు పెంచింది. ఈనేపథ్యంలో స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం సి2 ప్లస్‌ 50శాతం ఫార్మలా ప్రకారం చెరకు సాగుకు అయ్యే మదుపు లెక్కించి దానిపై 50శాతం పెంచి ధర నిర్ణయం చేయాల్సివుంది. ఎన్నికలకు ముందు ప్రధాన నరేంద్రమోడీ కూడా ఇదే పద్ధతిలో మద్ధతు ధర చెల్లిస్తామని ప్రకటన చేశారు. ఈలెక్కన టన్ను చెరకుకు రూ.5వేల చొప్పున చెల్లించాల్సి వుందని ఎపి రైతు సంఘం డిమాండ్‌ చేస్తోంది. కేంద్రం దీన్ని అమలు చేయలేదు సరికదా మద్ధతు ధర నిర్ణయించడానికి ప్రాతిపదికగావున్న రికవరీ శాతాన్ని 9.5 నుంచి 10.5శాతానికి పెంచింది.
మన రాష్ట్రంలో చెరకు పరిశోధనలు ఏళ్ల తరబడి ముందుకు సాగడం లేదు. ఫలితంగా కొత్త రకం విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికీ 10ఏళ్ల నాటి విత్తనాలనే ఉపయోగించడం వల్ల దిగుబడి దిగుబడి ఎకరాకు 20టన్నుల నుంచి అత్యధికంగా 40టన్నులకు మించి రావడం లేదు. రికవరీ రేటు కూడా మన రాష్ట్రంలో 9.5శాతానికి మించి రావడం లేదు. దీంతో, చెరకు రైతులు ధర విషయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. క్వింటాకు రూ.10 పెంపు అనేది ఏటా పెంచుతున్నదేనని, దానికి ఎలాంటి కొలబద్దా లేదని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.