ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : నాట్యం చేయడం చేతకాని ఓ నృత్యకారుడు.... మద్దెల వాడు సరిగా వాయించలేదన్నాడట. చెరకు రైతుల విషయంలో ప్రభుత్వ నాటకం అచ్చంగా అలాగే ఉంది. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని తెరిపించమంటే రైతులు తగినంతగా సాగుచేయకపోవడం వల్లే ఫ్యాక్టరీ తెరిపించడం సాధ్యం కాలేదని చెప్తోంది. ఇటీవల జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో జిల్లాలో మరోసారి భీమసింగి చెరకు రైతుల సమస్య చర్చనీయాంశమైంది.
విజయగనగరం ఉమ్మడి జిల్లాలో పెద్దగా సాగునీటి వనరులు లేకపోవడంతో నీటి వసతి కాస్త అటు ఇటు అయినా చెరకు, గోగు విస్తారంగా పండేది. గోగు నారకు మద్ధతు ధర లేకపోవడంతో దాదాపు గోగు సాగు తగ్గిపోయింది. ఫలితంగా గోగు నార కొనుగొలు కేంద్రాలు (సిసిఎఫ్), జ్యూట్ మిల్లులు దాదాపు కనుమరుగయ్యాయి. ఈ సంగతి కాస్త పక్కనబెడితే ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో చెరకు సాగు సాగువిస్తీర్ణం 50వేల ఎకరాలకుపైగా ఉండేది. సాగులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధర కల్పించకపోవడం, గడిచిన పదేళ్ల కొత్తగా పరిశోధనలు చేపట్టకపోవడం వల్ల రికవరీ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల రైతులు క్రమంగా చెరకు సాగును తగ్గించుకుంటున్నారు. 2014-15లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో చెరకు సాధారణ విస్తీర్ణం 37,297 ఎకరాలుకాగా, ప్రస్తుతం 11,265 ఎకరాలకు తగ్గింది. దీన్నిబట్టి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 26,,032 ఎకరాలు తగ్గిపోయినట్టు స్పష్టమౌతోంది. రాష్ట్రంలో చెరకు పరిశోధనలు గడిచిన రెండు దశాబ్ధాలకాలంగా జరగడం లేదు. ఫలితంగా సుమారు పదేళ్లగా కొత్తరకం విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్ల దిగుబడి కూడా సగానికి సగం తగ్గిపోతోంది. సుగర్ రికవరీ రేటు కూడా మన రాష్ట్రంలో 9.5శాతానికి మంచిరావడం లేదు. మరోవైపు చెరకు రైతులకు సబ్సిడీ పథకాలు లేవు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్పత్తికి అయ్యే ఖర్చుపై మద్ధతు ధర ప్రకటించకపోవడం వల్ల రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి. ధరలో లోటును భర్తీచేసే చెరకు పాలసీని కూడా పదేళ్ల క్రితమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో, జిల్లాలో క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గింది. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 60వేల ఎకరాల నుంచి 11వేల ఎకరాలకు తగ్గింది. అనివార్యంగా ఉత్పత్తి కూడా అదే స్థాయిలో తగ్గింది. ఇందుకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం సాగు, దిగుబడి తగ్గడాన్ని బూచిగా చూపి ఏకంగా పరిశ్రమలనే మూసి వేసేందుకు, ఆ తరువాత రియల్ ఎస్టేట్‌గా మార్చేందుకు కంకణం కట్టుకుంది. రైతులు పండించడం లేదంటూ బుకాయిస్తోంది. ధర లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతోంది.
ఈ నేపథ్యంలో ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు? రాష్ట్రంలోనైనా పెంచే ఆలోచన ఎందుకు చేయడం లేదు? తమకు ఇస్తున్న ప్రోత్సాహకాలేమిటి? అని చెరకు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం సుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడం లేదా రియల్ ఎస్టేట్‌గా మార్చడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఎపి రైతు సంఘం, చెరకు రైతు సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. అందుకు తగ్గట్టే సీతానగరం పరిధిలోని ఎన్‌సిఎస్ సుగర్ ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేశారు. వీటిని అధికార పార్టీకి చెందిన నాయకులే వసపర్చుకున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సుమారు 40 నుంచి 60కిలో మీటర్ల దూరంలోవున్న రేగిడి మండలం సంకలి సుగర్ ఫ్యాక్టరీలో క్రిషింగ్ ఏర్పాట్లు చేశామని ఉచిత సలహాలు ఇస్తోంది.
ధర పెంచితేనే సాగు, ఉత్పత్తులు పెరుగుతాయి
ధరను పెంచితేనే సాగు, ఉత్పత్తి పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆ మాత్రం తెలీదా? ఉద్దేశపూర్వకంగానే రైతుల్ని తికమక పెడుతోంది. చిత్తశుద్ధి ఉంటే మద్ధతు ధర కల్పించడం ద్వారా సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషిచేయాలి. స్వామినాధన్ కమిషన్ ప్రకారం చెరకు ఉత్పత్తి ధరపై అదనంగా 50శాతం కలిపి ధర నిర్ణయించే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాలి. నూతన పరిశోధనలు జరిపి, కొత్తకొత్త ఆవిష్కరణలతో చెరకు సాగును ప్రోత్సహించాలి. అంతే, తప్ప తమకు సంబంధం లేదన్నట్టు రైతులపైకి నెట్టేసి భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని మూసివేయడం సరికాదు.
- గుల్లిపల్లి లలిత,
భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్










