ఒకవేళ బిజెపి భారతదేశ చరిత్రను తిరగరాసినా,అది అంత తేలిగ్గా స్ప ృశించలేని అంతర్జాతీయ రికార్డులు, చరిత్రలు ఉన్నాయి.అన్ని రికార్డుల నుండి స్వాతంత్య్ర భారతదేశంలోని మొట్టమొదటి 17 సంవత్సరాలను కొట్టివేయకుండా నెహ్రూను చెరిపి వేయలేము.ఆరెస్సెస్, బిజెపి హిందూ రాజ్యస్థాపన లక్ష్యానికి నెహ్రూను చెరిపి వేయడం చాలా కీలకమైన అంశం. ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది.దీనిని జార్జ్ ఆర్వెల్ ''1984'' లో, ''వర్తమానాన్ని అదుపు చేసే వారు గతాన్ని అదుపు చేస్తారు, గతాన్ని అదుపు చేసే వారు భవిష్యత్తును అదుపు చేస్తారని'' చక్కగా వివరించాడు.
మరణించిన వారు, తమ గురించి,తమ తరువాత తరం వారు ఏమనుకుంటారో అనే విషయాన్ని పట్టించుకోరు. వారిని ఎలా గౌరవించాలి, ఎలా స్మరించుకోవాలి అనే ప్రశ్నలు తరువాత వచ్చే వారిని ఇబ్బందులకు గురి చేస్తాయి. వీటికి అంత తేలికగా సమాధానాలు దొరకవు. కానీ, నీచమైన పొగడ్త, లేదా మత దురభిమానం నిర్దారణను ప్రభావితం చేసినప్పుడు, అది మహాత్ముల చరిత్రను సష్టించడం లేదా చెరిపి వేయడం జరుగుతుంది. భారతీయ చారిత్రక పరిశోధనా సంస్థ (ఐసీహెచ్‌ఆర్) వారు 75 వ భారత స్వాతంత్య్ర వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పోస్టర్ లో జవహర్ లాల్ నెహ్రూ ఫోటోను తొలగించిన తీరు ఆ సంస్థ అల్ప బుద్ధిని,పాలక పార్టీ సంకుచిత తత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది.
వివిధ ప్రాంతాల్లో రాజకీయాలు , రాజ్యాంగ వ్యవహారాల నుండి వివిధ సంస్థలకు చెందిన భవనాల నిర్మాణం దాకా ఈ ధోరణే కనిపిస్తుంది. స్వతంత్ర భారదేశానికి తొలి ప్రధానిగా పదిహేడేళ్ల పాటు పనిచేసి, ఆధునిక భారత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రూను ఉదహరించకుండా స్వాతంత్య్ర భారతదేశ చరిత్రను ఎవరూ రాయలేరు. ఆయన అనేక విజయాలు సాధించాడు. 1964లో తుది శ్వాస విడిచే వరకు దేశానికి ఎనలేని సేవలందించాడు. నెహ్రూను కీర్తిస్తూ చేసిన సాహిత్యం ఉంది. ఆయన నిర్ణయాలు, విభిన్న మతాలు, తత్వాలు, భావాల పట్ల ఆయనకు విశాలమైన దృక్పథం కలిగివున్నారు. ఆయన రచనల్లోను అది ప్రతిబింబిస్తుంది. నెహ్రూ ప్రభుత్వం నెలకొల్పిన సంస్థలు, ప్రజాస్వామిక వ్యవస్థలు, 1947 తరువాత భారతదేశానికి అంతర్జాతీయంగా గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.
బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్న నెహ్రూ సుమారు తొమ్మిది సంవత్సరాలు రాజకీయ ఖైదీగా జైలు జీవితం గడిపాడు. ''సంపూర్ణ స్వరాజ్యం'' కోసం గట్టిగా గళం విప్పాడు.భారతదేశ ప్రజాస్వామిక, సంక్షేమ రాజ్య నమూనాను వ్యక్తీకరించే 1931 కరాచీ తీర్మానం తేవడంలో ఆయన కీలక భూమిక వహించాడు. హిందూ సంస్కతిని అర్థం చేసుకుని లౌకికవాదం పట్ల నిబద్ధతతో వ్యవహరించాడు. మతతతత్వ రాజకీయాలను వ్యతిరేకించాడు. ఆధునిక భావాలు, శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేశాడు.. తన మంత్రివర్గంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ వంటి వారికి స్థానం కల్పించినప్పటికీ, హిందూ మహాసభను, ఆరెస్సెస్ భావజాలాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించాడు.
నెహ్రూకు ఉన్న ప్రతిష్ట అన్ని వర్గాల ప్రజల మన్ననలను అందుకుంది.ఆయన మరణించిన సమయంలో 'ద ఎకానమిస్ట్' అనే పత్రిక ''వరల్డ్ వితౌౌట్ నెహ్రూ'' అనే శీర్షికను పెట్టగా, 'ద న్యూయార్క్ టైమ్స్' ఆయనను ''నవభారత నిర్మాత'' గా అభివర్ణించింది. హిందూ మహాసభ, ఆరెస్సెస్ మాత్రం ఆయనను ద్వేషించాయి. ఆయనను ఆరెస్సెస్ ఇంతగా ద్వేషించడానికి ఆధునిక భారతదేశానికి సంబంధించిన ఆయన భావన భారత్‌ను మరో పాకిస్తాన్‌లా మార్చాలన్న హిందూత్వ శక్తుల పన్నాగానికి అడ్డుకట్ట వేయడమే కారణం.. ఆరెస్సెస్ శిక్షణ పొందిన రాజకీయ నాయకులు అప్పుడప్పుడు నెహ్రూను పలుకరించే లౌక్యం ప్రదర్శించేవారు. 2014 లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెహ్రూను ద్వేషించడం మరింత ఎక్కువైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలు ద్వేషభావాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించేందుకు తమ ముసుగును తొలగించారు. వారు ఒప్పుకున్న విధంగా వారి బందం లక్ష్యం ''కాంగ్రెస్ పార్టీ లేని భారతదేశాన్ని సష్టించడం'', కానీ ఇది రాజకీయ ప్రతిపక్షాన్ని దాటి పూర్తిగా ధ్వంసం చేసే దిశగా వెళ్లింది. నెహ్రూ పాలనా కాలంలో చేసిన కార్యక్రమాలను తోసిపుచ్చడం, నెహ్రూకు వ్యతిరేకంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచే విధంగా ప్రచారం చేయడం, అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో ఆయన జ్ఞాపకాలను అగౌరవ పరచడం.నెహ్రూ ఆలోచనా విధానాన్ని చెరిపి వేసి, స్వాతంత్య్ర భారతదేశ చరిత్రను తిరగరాయడం వారి ప్రధానమైన ఎజెండా. కానీ ఈ రెండు అనివార్యంగా పరస్పర సంబంధితాలు. ప్రజాస్వామ్యం కన్నా నిరంకుశంగా వ్యవహరించే ఒక ప్రభుత్వంలో పాలకుల ఇష్టాయిష్టాలకు అనుకూలంగా మారడం పెద్ద కష్టమేమీ కాదు. హిందూ రాజ్య స్థాపనను సవాల్ చేయడాన్ని మసకబరచాలని చూసే హిందూత్వ శక్తుల పన్నాగంలో భాగమే ఐసీహెచ్‌ఆర్ పోస్టర్. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అధీనంలో పనిచేసే ఐహెచ్‌ఆర్‌సి చారిత్రిక ప్రదేశం జలియన్ వాలా బాగ్ ను పర్యాటక కేంద్రంగా మార్చడం, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ''జీహాదీ టెర్రరిజం'' పేరుతో ఒక కోర్సును ప్రవేశపెట్టడం లాంటివి ఆరెస్సెస్ పన్నాగంలో భాగమే.
నెహ్రూ కోరుకున్న భారతదేశం యొక్క మన సమిష్టి జ్ఞాపకాలు, ఆయనకు సంబంధం ఉన్న సంస్థలు, వ్యవస్థలను చెరిపి వేసే ఏకైక ఎజెండా లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. .నెహ్రూను, ఆయన ఆలోచనలను మసకబార్చే యోచన కేవలం ఐసీహెచ్‌ఆర్ పోస్టర్ కే పరిమితం కాలేదు. చారిత్రిక నిర్మాణాలకు, పూర్వకాలపు దస్తావేజులకు, సంస్థలకు, ఇతర అనేక విభాగాలకు విస్తరిస్తున్నది. పాఠ్య పుస్తకాలను కాషాయీకరించడం, చరిత్రను తిరగరాసేందుకు యత్నించడం వంటివి చేస్తునది. లౌకికవాదాన్ని, అభ్యుదయాన్ని కోరుకునే వారి వ్యక్తిత్వాలను మసకబరచడం లేదా ఉన్నతంగా కీర్తించడం,రివిజనిస్ట్ చరిత్రను ఘనంగా చూపించే యత్నం చేయడం వంటివి జరగుతున్నాయి. అక్బర్ ను మసకబరచడం ద్వారా తన విరోధి అయిన రాణా ప్రతాప్ హాల్దీఘాట్ యుద్ధంలో విజేతగా ప్రత్యక్షమయ్యాడు. పాఠ్యాంశాలలో మహాత్మా గాంధీని అప్రధానమైన వ్యక్తిగా మార్చేస్తూ, ఆయన హంతకుడైన నాథూరామ్ గాడ్సే ను దేశభక్తునిగా కీర్తిస్తున్నారు. బ్రిటిష్ వారికి క్షమాపణలు కోరిన విడి సావర్కర్‌ను వీర్ సావర్కర్ అని ఆకాశానికెత్తేశారు. ఆయన ఇప్పుడు భారత స్వాతంత్య్రోద్యమానికి ఒక గొప్ప ప్రసిద్ధి చెందిన వ్యక్తి అయ్యాడు! భారత జాతీయ కాంగ్రెస్ ను మాత్రం బ్రిటిష్ వారు ''పెంచి పోషించిన బిడ్డ'' గా వీరు పిలుస్తారు.
ఇక్కడ పొసగని విషయం ఏమంటే, రాజకీయ ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ గాంధీ కుటుంబం, పౌర సమాజాల నుండి ఎటువంటి ఉత్సాహం లేకుండా, అనాసక్తతతో ఉంటూ, తాత్కాలిక ప్రతిస్పందనలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ప్రస్తుత ప్రభుత్వం కన్నా దేశం పురాతనమైనది, పెద్దది అనే విషయాన్ని భారతదేశంలోని కొన్ని ప్రతిపక్ష పార్టీలు గుర్తించలేకపోతున్నాయి. సుదీర్ఘ కాలం పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆలోచనలను చెరిపి వేసేందుకు జాతి చరిత్రను తిరగరాసే చర్య అనుమతించరానిది. కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యకరంగా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది.దీనిపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు బిజెపి పైన అరుస్తూ కోపోద్రిక్తులవుతుంటే కొందరు మాత్రం మౌనంగా ఉంటున్నారు. బహుశా, నెహ్రూ ఆలోచనలకు అనుకూలంగా ఉంటే పాలకుల దష్టిలో నేరస్థులమవుతామని భయపడు తుండవచ్చు.నెహ్రూ వారసత్వం భారతదేశ చరిత్రలో ఒక భాగం కాబట్టి,కాంగ్రెస్ పార్టీ ఆ వారసత్వాన్ని కాపాడేందుకు, దానిని స్వంతం చేసుకునేందుకు మార్గాలను వెతకాలి.
నెహ్రూ గాంధీ కుటుంబాలకు నెహ్రూ గురించి మాట్లాడే హక్కు సహజంగానే ఉంటుంది, కానీ తన తల్లీ, చెల్లి కంటే కూడా, రాహుల్ గాంధీనే తన ముత్తాత గురించి మాట్లాడడం లేదు. నెహ్రూ జ్ఞాపకాలను ఒక క్రమపద్ధతిలో చెరిపి వేసే చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఆ కుటుంబానికి ఉంది.వారి కుటుంబం, కాంగ్రెస్ పార్టీ నెహ్రూను గురించి యువతరానికి తెలియజెప్పే ప్రయత్నం చేయలేకపోతోంది. భావజాలపరంగా హిందూత్వ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, బిఆర్ అంబేద్కర్,భగత్ సింగ్ ల భావాల పట్ల బిజెపి తన వ్యతిరేకతను దాచుకుంటూనే, నెహ్రూను ఎందుకు ఇంతగా ద్వేషిస్తున్నదో తేలికగానే గుర్తించవచ్చు. నెహ్రూ కోసం, అంతే సమానంగా భారతదేశ చరిత్ర కోసం ఈ భారాన్ని మోయాల్సిన బాధ్యత కుటుంబం, కాంగ్రెస్ పార్టీ రెండింటిపై ఉంటుంది.
పౌర సమాజంతో మాట్లాడడం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. నెహ్రూ పాలనా కాలంలో, నెహ్రూ ఆలోచనా విధానంతో నిర్వహించబడిన సంస్థల ద్వారా లబ్ది పొందిన వారు కూడా నెహ్రూ విధానాల పై ఇతరులతో చర్చించడానికి, సవాల్ చేయడానికి సుముఖంగా లేరు.కాంగ్రెస్ పార్టీ,లేక గాంధీలు ఆ విషయాలపై సంభాషిస్తే, కనీసం పౌర సమాజం లోని ఒక వర్గం వారికి వంత పాడతారు. నెహ్రూను అంచనా వేసే అన్ని వేదికలు ఇవ్వజూపిన అవకాశాలను స్వీకరించాలి.
ఒకవేళ బిజెపి భారతదేశ చరిత్రను తిరగరాసినా,అది అంత తేలిగ్గా స్పృశించలేని అంతర్జాతీయ రికార్డులు, చరిత్రలు ఉన్నాయి.అన్ని రికార్డుల నుండి స్వాతంత్య్ర భారతదేశంలోని మొట్టమొదటి 17 సంవత్సరాలను కొట్టివేయకుండా నెహ్రూను చెరిపి వేయలేము.ఆరెస్సెస్, బిజెపి హిందూ రాజ్యస్థాపన లక్ష్యానికి నెహ్రూను చెరిపి వేయడం చాలా కీలకమైన అంశం. ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది.దీనిని జార్జ్ ఆర్వెల్ ''1984'' లో, ''వర్తమానాన్ని అదుపు చేసే వారు గతాన్ని అదుపు చేస్తారు, గతాన్ని అదుపు చేసే వారు భవిష్యత్తును అదుపు చేస్తారని'' చక్కగా వివరించాడు.
(''న్యూస్ క్లిక్'' సౌజన్యంతో)
స్మతీ కొప్పీకర్











