
చెన్నై : తమిళనాడులోని చెన్నైలో ఉన్న ప్రముఖ టివి చానల్ సత్యం ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కార్యాలయంలోకి దూసుకు వచ్చి.. వెంట కత్తి తెచ్చి హల్ చల్ చేశాడు. ఆస్తులు ధ్వంసం చేశాడు. సిసిటివిలో రికార్డైన ఈ దృశ్యాలను సత్యం టివి..తన చానల్‌లో ప్రసారం చేసింది. కార్ పార్కింగ్ ప్రాంతం నుండి ఆఫీసులోకి వచ్చిన సదరు వ్యక్తి..వెంట ఆయుధాలను తీసుకువచ్చాడని చానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఐసాక్ లివింగ్ స్టోన్ తెలిపారు. తననే లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డాడని, ఆఫీసులోకి రాగానే తన గురించే ఆరా తీశాడని, ప్రస్తుతం నిందితుడు అరెస్టు అయినట్లు చెప్పారు. ఈ దాడి వెనుక కారణాలపై స్పందిస్తూ... మేము వ్యక్తిగతంగా ఎవరిపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయలేదని, దీని వెనకు కారణాలు తెలియదని చెప్పారు. అయితే ఈ ఘటనపై రాయపురమ్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. నిందితుడ్ని రాజేష్ కుమార్‌గా గుర్తించామని, విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనను చెన్నై ప్రెస్ క్లబ్ ఖండించింది. జర్నలిస్టులు, వారి కార్యాలయాల భద్రత కోసం చట్టాలను రూపొందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ప్రెస్ క్టబ్ ఉమ్మడి కార్యదర్శి భారతి తమిళన్ విజ్ఞప్తి చేశారు.