ప్రజాశక్తి - ముదినేపల్లి
మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అనుమతులు లేకుండా మట్టి తవ్వి విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. రైతుల అవసరాల సాకుతో డ్రెయిన్ల గట్లును కూడా తవ్వేస్తూ మట్టిని తరలించుకుపోతున్నారు. కొంత మంది ప్రజాప్రతినిదులు, రాజకీయ నాయకులు మట్టి మాఫియ ఆవతారం ఎత్తి వ్యాపారం చేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడంతో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. ఈ తవ్వకాల తంతు వెనుక అధికార పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండటంతో మట్టి దందా జోరుగా సాగుతోంది. ముదినేపల్లిలో చినపాలపర్రు ఆయకట్టు సమీపంలో పోల్‌రాజ్ మేజర్ డ్రెయిన్ గట్టును మట్టి మాఫియా తవ్వేస్తుంది. డ్రెయిన్ గట్టును సగం మేర తవ్వేస్తూ మట్టిని ట్రాక్టర్లల్లో ఖాళీ స్థలాలు, లేఆవుట్లకు తరలిస్తూ భారీగా మట్టి వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా ముదినేపల్లిలోని పోల్‌రాజ్ డ్రెయిన్ వంతెన వద్ద తామరోలు డ్రెయిన్ గట్టును మట్టి మాఫియా ఐదు గజాల మేర గట్టును తవ్వేసి ట్రాక్టర్లల్లో మట్టిని తరలించుకుపోతున్నారు. పగలు, రాత్రీ తేడా లేకుండా తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. అధికారులకు మట్టి మాఫియా నుంచి భారీగా ముడుపులు అందడంతో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం నుంచి వరుస సెలవులు రావడంతో మట్టి మాపియా చెలరేగిపోతూ మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. మాఫియా డ్రెయిన్ల గట్లను సగం మేర తవ్వడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు, వరదల సమయంలో డ్రెయిన్ల గట్లకు గండి పడే ప్రమాదం ఉంటుందని, దీంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆయకట్టు రైతులు కంగారుపడుతున్నారు. వైసిపి పెద్దల సహకారంతోనే ఇదంతా జరుగుతోందని పలువురు చెబుతున్నారు. ఈ డ్రెయిన్ల గట్లను అక్రమంగా తవ్వుతున్న విషయమై వివరణ అడిగేందుకు డ్రెయినేజీ ఎఇ రాజ్‌కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. సంబంధిత అధికారులు స్పందించి మట్టి మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాలని, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.










