May 16,2021 13:10

గురి చూసి లేత చింతకాయల మీద రాళ్ళు వేస్తున్నారు తొమ్మిదవ తరగతి పిలకాయలు. రాలిన కాయల్ని ఏరి కుప్ప చేస్తున్నారు ఎనిమిదవ తరగతి పిలకాయలు.
ఇంతలో ఒకడు పరుగెత్తుతూ వచ్చి స్టైల్‌గా నిలబడి ''ఒరేరు, ఒరేరు, మన బడికి కొత్త అయ్యోరు వచ్చినాడు'' అని చెప్పినాడు. లేత చింతాకు కోస్తున్న ఒకడు ''మాకు తెలుసులేవోరు, వచ్చింది కొత్త అయ్యోరు కాదు, కొత్త హెడ్‌ మాస్టర్‌'' అని చెప్పడంతో అందరూ ''అవునా'' అని ఆశ్చర్యంగా అడిగినారు.
''అవును. మా ఊరి డ్రిల్లు అయ్యోరు రాత్రి చెప్పినాడు. ఆయన పేరు డేవిడ్‌ రాజు. కడప జిల్లా రాయచోటి సొంత ఊరు అంట. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ అంట. యోగాసనాలు భలే వేస్తాడంట. ఇంగ్లీషు భలే మాట్లాడతాడంట రబ్బా''.
కొత్త సారు దగ్గరికి పోవాలని ఒకడు పుడింగి మాదిరి చకచక పోయినాడు. కొద్ది దూరం వెళ్ళాక భయమేసి, సరుక్కున వెనక్కి దిరిగి లెఫ్ట్‌ రైట్‌ కొట్టుకుంటూ వచ్చేసినాడు. గుండె కాయలున్న పిలకాయలు మాత్రం సారు దగ్గరికి వెళ్లి ''నమస్తే సార్‌'' అంటూ దీర్గాలు తీసి చెప్పినారు. కొంతమంది ఆడ పిలకాయలు గదుల్లో నుంచే తొంగితొంగి చూసినారు.
హెడ్‌ మాస్టర్‌గా ఛార్జ్‌ తీసుకున్న మొదటి రోజు- తెలియని తియ్యటి అనుభూతి.
ప్రేయర్‌ బెల్‌ మోగడంతో పిల్లలు అందరూ స్టేజి వద్దకు చేరారు. ప్రేయర్‌ జరుగుతోంది. అందరూ చక్కగా నిలబడుకుని ''మా తెలుగుతల్లికి మల్లె పూదండ'' పాటను కోరస్‌గా పాడుతున్నారు. మూడవ వరుసలో వున్న వంగ రంగు వోణీ వేసిన నిశిత మాత్రం అప్పుడప్పుడు మెడ తిప్పి బడి ప్రహరీ గోడ వైపు చూస్తోంది. కోపం తన్నుకొచ్చింది డేవిడ్‌రాజుకు. అయినా, ప్రేయర్‌ మధ్యలో వార్నింగ్‌ ఇవ్వడం బాగుండదని గమ్మున ఉండిపోయాడు.
ప్రేయర్‌ అయ్యాక మాత్రం నిశితను చూస్తూ ''ప్రేయర్‌ అనేది రోజంతా మంచి జరగాలని కోరి చేసేది. దిక్కులు చూడడం మంచిది కాదు'' అని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. తల వంచుకుని గబగబా వెళ్ళిపోయింది నిశిత.
ఇంతలో గుట్ట మీదికి మేకల్ని తోలుకెళ్తున్న ఒక నలభై ఏళ్ల స్త్రీ, వాటిని దారి పక్కకి తోలి గబగబా బడికాడికి వచ్చింది. ''అయ్యోరా, మా మేకలకి కాలిగిట్టల జబ్బు వచ్చింది. పశువుల డాక్టరు దగ్గరికి వెళ్లి విషయం కనుక్కుని రమ్మని మా అబ్బిని తిరుపతికి పంపించినాను. రెండు రోజులు బడికి రాడు'' అని చెప్పేసి సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది.
రెండవ రోజు- ఇంటర్వెల్‌ సమయం. పిల్లలంతా జాలీగా ఆడుతూ పాడుతూ ఉన్నారు. విరగబూసిన తురాయి చెట్లు గాలికి అటూఇటూ ఊగుతున్నాయి. చల్లటి వాతావరణంలో ఎర్రటి గన్నేరు చెట్లు ఊగుతూ వుంటే కిటికీ గుండా వాటినే చూస్తున్నాడు హెడ్‌ మాస్టర్‌.
ముందురోజు రాత్రి వర్షం పడి వుండడం వల్ల బడి ఆవరణమంతా బురదగా వుంది. ప్లే గ్రౌండ్‌లో అక్కడక్కడా నీళ్ళు నిలిచి వున్నాయి. పిల్లలు పరుగెత్తుతూ గోడపక్కన ఉన్న నీళ్ళలోకి దూకారు. నీళ్ళు సర్రున ప్రహరీ గోడ మీద పడ్డాయి. వారు అదేమీ పట్టించుకోకుండా ఆడింది ఆడిందే.
దూరంగా నిలబడి గోడనే చూస్తున్న నిశిత పరుగులు తీస్తూ వచ్చింది. పిల్లల్ని తిడుతూ పక్కనే ఉన్న హ్యాండిల్‌ బోర్‌ని కొట్టి నీళ్ళు దోసిళ్ళతో పట్టి గోడ కడిగింది. మురికి కొంచెం మిగిలివుంటే తన పావడతో తుడిచింది.
ఆశ్చర్యంగా చూసాడు హెడ్‌ మాస్టర్‌. పిలిచి కారణమేమిటని అడుగుదామనుకున్నాడు. ఇంతలో బడి గంట కొట్టడంతో, నిశిత తరగతి గదిలోకి వెళ్ళిపోయింది.
మూడవ రోజు ఉదయం..
తడి మట్టి వాసన తెరలుతెరలుగా వస్తోంది. తెల్ల కొంగలు చెట్ల కొమ్మల మీదకు వచ్చి వాలాయి. అప్పుడే బ్యాగు తీసుకుని బడికి వచ్చిన నిశితను హెడ్‌ మాస్టర్‌ కాంపౌండ్‌ వాల్‌ని కడిగిన విషయం అడిగాడు. బ్యాగు నేల మీద పెట్టి రెండు చేతులూ కట్టుకుని ఇలా చెప్పింది.
''మా నాన్న పాత పాత్రలను రిపేరు చేసే టింకరు పని చేస్తాడు. మా అమ్మ ఊర్లో వాళ్ళ గుడ్డలు ఉతుకుతుంది. నాకు ఒక అన్న ఉండేవాడు. తిరుపతి పాలిటెక్నిక్‌ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా చదివేవాడు. అమ్మానాన్నలకు సహాయకంగా ఉంటుందని లీవులప్పుడు కూలీ పనులకు వెళ్ళేవాడు. అయిదేళ్ళ ముందు మన బడి ప్రహరి కట్టేదానికి కాంట్రాక్టర్‌ పిలిస్తే కూలిపనికి వచ్చినాడు. లారీ నుంచి ఇసుక లోడ్‌ దించేటప్పుడు ఏమయ్యిందో ఏమో, మీద పడిన ఇసుకతో ఊపిరి ఆడక చనిపోయినాడు.
నాకు నా అన్న అంటే ప్రాణం. నన్ను బాగా చూసుకునే వాడు. ఇంట్లో వున్నా, బడిలో వున్నా నా మనసులోనే మెదలాడతాడు. ఇంట్లో వున్నప్పుడు
అన్న వేసిన గుడ్డలు, చదివిన పుస్తకాలు, వాడిన వస్తువులు గంటగంటకీ చూసుకుంటే కానీ నాకు తప్తి వుండదు. బడికి వస్తే అన్న కట్టిన గోడనే చూడాలనిపిస్తుంది. ఎవ్వరికీ తెలియకుండా తాకాలనిపిస్తుంది. అన్న లేడు కానీ, అన్న కట్టిన గోడ వుంది కదా అని నాకు నేను ధైర్యం చెప్పుకుంటాను. దానికి కొంచెం మురికి అయినా నా మనసు గిలగిలలాడుతుంది''.
''సరే క్లాసుకు వెళ్ళు'' అన్నారు హెడ్మాస్టారు.
నిశిత బ్యాగు ఎత్తుకుంటుంటే దానిలో కొన్ని గాజులు కనిపించాయి. ''ఏమిటవి'' అని అడిగాడు.
''మా అన్న తిరుపతిలో చదివేటప్పుడు గోవిందరాజ స్వామి గుడి వద్ద కొనుక్కొచ్చి ఇచ్చిన గాజులు. నా చేతులు లావు అవడంతో అవి పట్టడం లేదు. అందుకని వాటిని భద్రంగా బ్యాగులోనే దాచి పెట్టుకున్నాను''.
'ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య ఇంత అనుబంధమా' అని ఆశ్చర్యపోయాడు. కాసేపటికి తేరుకుని-
''నిశితా, నీకు ఏ చదువు చదవాలని వుంది'' అనడిగాడు.
''మా అన్న చదివిన సివిల్‌ ఇంజినీరింగ్‌ చదవాలని వుంది''
''నిశితా, మా బంధువుల అబ్బాయి అమెరికాలో వున్నాడు. చదువు పైన శ్రద్ధ వున్న అమ్మాయి ఎవరైనా ఉంటే చదివినంత చదివిస్తానన్నాడు. ఆయన ఇచ్చే ఆర్థిక సహాయంతో బాగా చదువు. జీవితంలో మంచి స్థాయికి వస్తావు'' అని ధైర్యం చెప్పాడు.
సారు కాళ్లకు మొక్కింది నిశిత. కాళ్ళ మీద పడ్డ కన్నీటి బొట్లకు సారు మనసు ఉద్వేగానికి గురి అయ్యింది. తనకి తెలియకనే కండ్ల కొనల నుండి కన్నీటి చుక్కలు తొంగి చూసాయి.
×××
పది సంవత్సరాల క్యాలెండర్లు సర్రున మారిపోయాయి.
ఒక సాయంత్రం, బడి ముందర నల్లటి స్కార్పియో కారు వచ్చి ఆగింది. పట్టు చీర కట్టి సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన నిశిత మేడమ్‌ పైన పిల్లలు పూలవర్షం కురిపించారు. పాత హెడ్‌ మాస్టర్‌ డేవిడ్‌ రాజు మేడమ్‌కి బొకే అందించారు. గ్రామ ప్రజలు చప్పట్లు కొట్టారు. స్టాఫ్‌తో పాటు కొత్త హెడ్‌ మాస్టర్‌ చిరునవ్వులు చిందిస్తూ ఆహ్వానం పలికారు. పాత్రికేయులు ఫొటోలు తీశారు.
''మేడమ్‌, మన స్కూలు ఓల్డ్‌ స్టూడెంట్‌. అన్నా యూనివర్సిటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివింది. తరువాత పూనాలోని ప్రతిష్టాత్మకమైన నిక్‌మార్‌ సంస్థలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి ఢిల్లీలోని మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది'' అని గ్రామ పెద్దలకు పరిచయం చేశాడు డేవిడ్‌ రాజు.
అందరినీ చూపులతో పలకరిస్తూనే నిశిత, బడి ప్రహరి గోడను కనులారా చూసి తియ్యటి గుటకలు మింగింది.
స్టేజీ పైన కుడివైపు మైకు వద్ద, ఆడపిల్లలు ఇలా పాడుతున్నారు ..:
''అన్నా, అన్నా, నీ మనసు వెన్న
రేయింబగుళ్ళు, నీ కలలే కన్నా
అన్నా, అన్నా, బంగారు అన్న
నీ నవ్వు ముందు, లోకం సున్న''.
స్టేజీ పైన ఎడమ వైపు మైకు వద్ద, మగ పిల్లలు ఇలా పాడుతున్నారు :
''చెల్లీ, చెల్లీ, బంగారు చెల్లీ
చల్లగ వుండు బంగారు తల్లీ
నూరేళ్ళు బతుకు నా చిట్టి చెల్లీ
మరో జన్మకి, మళ్ళీ అవుదాం అన్నాచెల్లీ''.
'అన్నా అన్నా నువ్వెక్కడున్నావు' అన్నట్లుగా బడి అవరణమంతా కళ్ళతోనే వెదికింది నిశిత.
'చెల్లీ చెల్లీ నేనిక్కడున్నాను' అన్నట్లుగా స్టేజీ వెనుక మిలమిలా మెరుస్తోంది, అన్న పేరుతో ఉన్న నూతన భవనం.
తన పాతిక లక్షల విరాళంతో నిర్మింపబడ్డ ఆ భవనాన్ని ప్రారంభోత్సవం చేయడానికై చిరునవ్వులు చిందిస్తూ అడుగు ముందుకేసింది.
 

ఆర్‌సి కష్ణస్వామి రాజు
93936 62821