Oct 27,2023 23:16

ప్రజాశక్తి-పిఠాపురం పట్టణంలోని ఎంఆర్‌సి భవన్‌లో ఎంఇఒ నారాయణదాసు శుక్రవారం జనవిజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్‌ సంబరాలు-2023 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందించడానికి జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రతి విద్యార్థీ సైన్స్‌ పట్ల అవగాహన కలిగినపుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జరిగే చెకుముకి సైన్స్‌ సంబరాల్లో పిఠాపురం మండలంలోని, అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ పాల్గొనేలా అన్ని యాజమాన్యాలూ కృషి చేయాలని కోరారు. చెకుముకి సైన్స్‌ సంబరాలు 33 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ టాలెంట్‌ పరీక్ష నవంబర్‌ 10న పాఠశాల స్థాయిలో, నవంబర్‌ 30న మండల స్థాయిలో, డిసెంబర్‌ 17న జిల్లా స్థాయిలో, 2024 జనవరి 27, 28 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెకుముకి కన్వీనర్‌ నేమిశేట్టి గంగబాబు, జనవిజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు వి.సత్యనారాయణ రెడ్డి, మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్‌ ఎన్‌.సూర్యనారాయణ, మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం మూర్తి, విరవ జెడ్‌పి హైస్కూల్‌ హెచ్‌ఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.