
ప్రజాశక్తి-కొనకనమిట్ల: నవంబర్ 10వ తేదీ నుంచి జరిగే పాఠశాల స్థాయి చెకుముఖి ప్రతిభ పరీక్షలను విజయవంతం చేయాలని జనవిజ్ఞాన వేదిక కొనకనమిట్ల మండల ప్రధాన కార్యదర్శి ఐజాక్‌బాబు కోరారు. శనివారం పొదిలి జెవివి కార్యాలయంలో అధ్యక్షులు పీవీ కొండయ్య అధ్యక్షతన జెవివి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ఉన్నత పాఠశాలలో 8,9,10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపర్చిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయన్నారు. అనంతరం చెకుముకి పోటీలకు సంబంధించిన కరపత్రిక, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెవివి ఉపాధ్యక్షులు బాలనరసయ్య, కోశాధికారి ఆంజనేయచౌదరి, నాయకులు వెంకటేశ్వర్లు, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పామూరు: గత 33 సంవత్సరాలుగా విద్యార్థులలో సైన్స్‌పై అవగాహన కల్పిస్తూ, ఆసక్తిని ప్రేరేపిస్తూ జనవిజ్ఞాన వేదిక నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు నవంబర్ 10వ తేదీ పాఠశాల స్థాయిలోనూ, నవంబర్ 30వ తేదీ మండల స్థాయిలోనూ, డిసెంబర్ 17 జిల్లా స్థాయి, జనవరి నెలలో రాష్ట్రస్థాయిలోనూ జరుగుతాయి. ఈ కార్యక్రమంలో 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొనాలని జెవివి జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ టి చెన్నకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పామూరు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి గారి సమక్షంలో చెకుముకి సైన్స్ సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పామూరు మండలం అధ్యక్షులు అబ్దుల్, ప్రధాన కార్యదర్శి శంకర్, కార్యవర్గ సభ్యులు ఉత్తర్‌రావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.