Sep 03,2022 23:27

ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న పైడిరాజు

ప్రజాశక్తి -ములగాడ : చెత్త పన్ను కట్టకుంటే చేయూత కట్‌ చేస్తామంటూ వార్డు సచివాలయ కార్యదర్శుల బెదిరింపులు ఆపాలంటూ జివిఎంసి 62వ వార్డు పరిధి దుర్గానగర్‌ సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మల్కాపురం జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు మాట్లాడుతూ, చెత్త పన్నులు కట్టిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తామని సచివాలయ కార్యదర్శులు ఒత్తిడి చేయడం దుర్మార్గమన్నారు. సచివాలయ అభివృద్ధి కార్యదర్శి శ్రీనివాసరావు, పారిశుధ్య కార్యదర్శి ప్రతిఫ్‌ కుమార్‌, వాలంటీర్‌ కృష్ణారావు మహిళలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. చెత్తపన్ను కట్టలేదని చేయూతకు తంబ్‌ వేయకుండా ఆపుతున్న వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. చెత్తపన్నుతో సంబంధం లేకుండా పథకాలు అందరికీ వర్తింపజేయాలని కోరారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి.గురులక్ష్మి, టి.అసిరమ్మ, ఎం.రాజేశ్వరి, ఎ.మహాలక్ష్మి, పి.దేవుడమ్మ, వై.ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.