మంచినీటి చెరువు కలుషితం
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - ముదినేపల్లి
మండలంలోని చేవూరు ప్రజలు వరహాల చేష్టలతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నిత్యం వరహాలు గుంపులుగుంపులుగా ఇళ్ల పెరట్లలోని ఆవ మొక్కలను పాడు చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ వాహనాలకు అడ్డంగా రావడంతో పలుసార్లు వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో పందుల కారణంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నవారి సంఖ్య అధికంగా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని ఇద్దరు అన్నదమ్ములు వీటిని పెంచుతున్నట్లు చెబుతున్నారు. పెంపకందారులు వీటిని ఇష్టారాజ్యంగా వదిలి వేయడంతో గ్రామంలో అన్ని వీధుల్లో సంచరిస్తూ ప్రజలకు అనేక విధాలుగా నష్టం కలుగజేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్షిత మంచినీటి చెరువులో దిగడంతో మంచినీటి చెరువులోని నీరు కలుషితమవుతుందని వాపోతున్నారు. వీటి కారణంగా ప్రజలు పలు రోగాలు బారిన పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పందులను జాగ్రత్త చేసుకోవాలని పందుల పెంపకందారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదంటూ గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు గ్రామ సర్పంచి వల్లభనేని లక్ష్మి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడంలేదంటూ సర్పంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చేవూరులో ఉన్న వరహాలను పట్టించి అడవి ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.










