ప్రజాశక్తి - ముదినేపల్లి
అంటువ్యాధుల బారిన పడకుండా ప్రతిఒక్కరూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ సర్పంచి నిమ్మగడ్డ కైకమ్మ అన్నారు. ముదినేపల్లి గ్రామ సచివాలయం వద్ద ఆదివారం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచి కైకమ్మ మాట్లాడుతూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధుల బారిన పడకుండా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వై.శ్యాంసుందర్, గ్రామ వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : మండల వ్యాప్తంగా ప్రపంచ చేతులు పరిశుభ్రత దినోత్సవ వేడుకలు ఆదివారం పలు గ్రామ పంచాయతీల్లో ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా, పంచాయతీ, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. మన ఆరోగ్యం మన చేతుల్లో అనే నినాదంతో ప్రజా భాగస్వామ్యంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్‌వాడీ, డ్వాక్రా విఒఎలు, మహిళలు, ఆశాలు పాల్గొన్నారు.
ముసునూరు : ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం చేసే ముందు, భోజనం తర్వాత చేతులను పరిశుభ్రం చేసుకోవాలని ఎంపిడిఒ జి.రాణి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా చేతల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మండలంలోని 16 గ్రామ సచివాలయాల్లో ఆయా పంచాయతీ సెక్రటరీ గ్రామస్తులకు అవగాహన కల్పించేటట్లు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి బసవరాజు అచ్యుత సత్యనారాయణ, పరిపాలన అధికారి కూచిపూడి సాయిరాం, సీనియర్ అసిస్టెంట్ ఎస్.శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ సన్నీరాజన్, మువ్వ స్రవంతి, ఆరేపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.










