Jul 13,2023 22:46

సమావేశంలో మాట్లాడుతున్న సవితమ్మ

పెనుకొండ: వైసిపి నాయకులకు చేతనైతే వెనక్కి వెళ్లిన కియా కంపెనీకి చెందిన 14 అనుబంధ సంస్థలను తీసుకురావాలని అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఆమె గురువారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి కియా పరిశ్రమ తెచ్చారని వైసీపీ మంత్రులు ఎంపీ ప్రగల్భాలు పలకడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వైసిపి నాయకులకు చేతనైతే కియా కంపెనీకి వచ్చి వెనక్కి వెళ్లిన 14 అనుబంధ సంస్థలను తీసుకురావాలన్నారు. లేపాక్షి నాలెడ్జ్‌ భూముల్లోకి పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలన్నారు. ఎవరో చేసిన అభివృద్ధిని తాము చేశామని గొప్పలు చెప్పుకుంటే ఎలా అని ప్రశ్నించారు.ఈ సమావేశంలో నాయకులు సోము, ప్రసాద్‌, మారుతి, వాసుదేవరెడ్డి, బాలాజీ నాయక్‌, ఓబులేష్‌, రాజేష్‌ ,అంజి,నారాయణ తదితరులు పాల్గొన్నారు.