- భవన నిర్మాణాలపై నిర్లక్ష్యం తగదు
- నిర్లక్ష్యంగా ఉన్న ఎఇలను సస్పెండ్ చేయండి
- పిఆర్ ఇంజినీర్లపై కలెక్టర్ ఆగ్రహం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జిల్లా అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం భవనాలను మంజూరు చేస్తే వాటిని సకాలంలో ఎందుకు పూర్తి చేయలేక పోతున్నారని, నిర్లక్ష్యంగా ఉన్న ఎఇలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో లిఖిత పూర్వకంగా తెలియ జేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లఠ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌శాఖలో పని చేస్తున్న ఉద్యోగులతో పని చేయించడం చేతకాక పోతే తక్షణమే సెలవుపై వెళ్లాలని ఆ శాఖ సూపరిండెంట్ ఇంజినీర్ మూర్తిని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై సమీక్షించారు. జిల్లాలో గ్రామ సచివాలయాలకు, హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ శాఖ చేపడుతున్న భవనాలకు ప్రాధాన్యత భవనాలుగా చెప్పుకుని వాటిని ఏళ్ల తరబడి పూర్తి చేయలేక పోతే ఎలా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. జిల్లాలో 251 గ్రామ, వార్డు సచివాలయ భవనాలు ఇప్పటివరకు ఎన్ని పూర్తి చేశారని ప్రశ్నించారు. టెక్కలి, శ్రీకాకుళం డివిజన్ల పరిధిలో ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలు తెలపాలని కలెక్టర్ ప్రస్తావించగా ఎస్‌ఇ మూర్తి మౌనం దాల్చారు. దీంతో అతనిపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 38 భవనాలు మాత్రమే పూర్తి చేశారని, ఈనెల 31లోగా మిగిలిన భవనాలన్నింటినీ పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ విఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, కార్యనిర్వాహక ఇంజినీర్లు సురేష్, కుమార్ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు పాల్గొన్నారు.










