Jan 24,2023 21:42

ప్రజాశక్తి - ఏలూరు
            చేతివృత్తిదారులకు రాష్ట్ర బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన రూ.52వేల కోట్లు కేటాయించాలని మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లేటి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వృత్తిదారుల జిల్లా సదస్సు స్థానిక యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో కమిటీ కో కన్వీనర్‌ పత్తిపాటి రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యవక్తగా పాల్గొన్న కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతీవృత్తిదారుని కుటుంబ సంక్షేమం కోసం రూ.25 వేలు ఆర్థిక సాయం (నగదు బదిలీ) అందించాలన్నారు. వారి కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని కోరారు. వృత్తినిర్వహిస్తూ ఏదైనా మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. వృత్తిదారుల ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు విధులు నిర్ణయించి, నిధులు కేటాయించి ఖర్చు చేయాలన్నారు. జనాభా ప్రాతిపదికన వృత్తిదారుల రక్షణ, సంక్షేమం, అభివృద్ధికి నిధులు కేటాయించాలని, మత్స్యకారుల జీవితాలను నాశనం చేసే 217 జిఒను రద్దు చేయాలని కోరారు. 343 జిఒ ప్రకారం పంచాయతీ చెరువులు స్థానిక మత్స్యకారుల సొసైటీలకు నామమాత్రపు లీజుకు ఇవ్వాన్నారు. హబ్‌ (ఫిష్‌ఆంధ్రా) పథకాన్ని నిలుపుదల చేయాలని కోరారు. చేపల వేట నిషేధ భృతిని రూ.20 వేలకు పెంచి సంప్రదాయ వేటగాళ్లు, చేపలు అమ్మే వారికి కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సబ్సిడీపై డీజిల్‌ రూ.20కు సరఫరా చేయాలని, గిట్టుబాటు ధర నిర్ణయించి బోర్డు పెట్టాలని కోరారు. చేనేతపై జిఎస్‌టి పూర్తిగా రద్దు చేయాలని, ప్రతీ చేనేత కార్మికునికి నేతన్న హస్తం ఇవ్వాలని, ప్రతీ చేనేత కార్మికునికి మగ్గం షెడ్డుతో కూడిన చెరువులు, దోభీ ఘాట్‌ స్థలాలు పిఒపిలో చేర్చి రజకులకు పూర్తి హక్కు కల్పించాలని డిమాండ్‌ చేశారు. జగనన్న చేదోడు పథకం వృత్తిదారులందరికీ ఇవ్వాలన్నారు. రజకులకు సామాజిక రక్షణ చట్టం (ఎస్‌సి, ఎస్‌టి) తరహాలో ఏర్పాటు చేయాలని, జిఒ 27 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న దోభీ పోస్టులను భర్తీ చేయాని కోరారు. కల్లుగీత వృత్తి అభివృద్ధి, ఆధునికీకరణకు నిపుణులతో కమిటీ వేయాలని, కల్లుగీత కార్పొరేషన్‌ పునరుద్ధరించి, ఆధునికీకరణ పరికరాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ హామీ ప్రకారం దశలవారీ మధ్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, ఇఎంఐ లేకుండా వడ్డెర వృత్తిదారులకు రూ.5 లక్షల వరకూ కాంట్రాక్టర్లు ఇవ్వాలని, కంకర క్వారీలపై పూర్తి హక్కు వడ్డెర వృత్తిదారులకే కేటాయిస్తూ జిఒ విడుదల చేయాలని కోరారు. గొర్రెలకు డీవార్మింగ్‌ ఏడాదికి నాలుగుసార్లు ఇవ్వాలని, వ్యాధులకూ, వ్యాక్సిన్‌ సరిపడినంత సరఫరా చేయాలని, ప్రతి పంచాయతీ పరిధిలో వెటర్నరీ డాక్టర్లను ప్రమోట్‌ చేయాలని, గొర్రెలు, మేకల పెంపకందారులకు రూ.2 లక్షల యూనిట్‌గా 50శాతం సబ్సిడీతో ఇవ్వాలని కోరారు. క్షౌరవృత్తి చేసే ప్రతి వృత్తిదారునికి జగనన్న చేదోడు రూ.10 వేలు ఇవ్వాలని, ప్రతిక్షౌర వృత్తిదారునికి రాష్ట్ర ప్రభుత్వం స్టాల్స్‌ కేటాయించి కామన్‌ షెడ్‌ నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలోని మాకినేని బసవన్నయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో జరిగే చేతివృత్తిదారుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని, తద్వారా భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా సదస్సులో ఎపి చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్‌ పిచ్చుక ఆదిశేషు, నాయుడు బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చందనాడ నందేశ్వరరావు, గొర్రెలు, మేకల పెంపకదారుల సంఘం ఏలూరు నగర కార్యదర్శి కొత్తల శివకుమార్‌, ఎపి కల్లుగీత కార్మిక సంఘం ఏలూరు నగర కార్యదర్శి శొంఠి శంకర్‌రావు, పి.నాంచారయ్య, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.