Feb 03,2023 00:06

ఞచేతికి తగులుతున్న విద్యుత్‌ వైర్లు

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట
మండలంలోని పి.భీమవరం, దాని గ్రామమైన గొన్నవానిపాలెం గ్రామాల్లో విద్యుత్‌ వైర్లు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పి.భీమవరం గ్రామంలో పాల సెంటర్‌ రోడ్డులో విద్యుత్‌ వైర్లు రోడ్డుపై వేలాడుతున్నాయి. దీంతో అటువైపు రాకపోకలు సాగించేవారు భయపడుతున్నారు. గొన్నవానిపాలెం గ్రామం ప్రవేశంలోని భూలోకమ్మ గుడి నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు గల రోడ్డులో ఉన్న విద్యుత్‌ కేబుల్‌ భూమికి ఆరడుగుల ఎత్తులోనే వేలాడుతుంది. ఈ మధ్యలో గల విద్యుత్‌ స్తంభం విరిగిపోవడంతో విద్యుత్‌ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పలుమార్లు విద్యుత్‌ శాఖ అధికారులను కోరారు. అయితే విద్యుత్‌ స్తంభాన్ని ఏర్పాటు చేసిన 15 రోజులు దాటిపోయినా పట్టించుకోలేదని గొన్నవానిపాలెం గ్రామస్తులు వాపోయారు. పి భీమవరం, గొన్న వానిపాలెం గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన విద్యుత్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి విద్యుత్‌ వైర్లను సరిచేయాలని కోరుతున్నారు. విద్యుత్‌ లైన్ల సమస్యపై స్థానిక లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగ అప్పారావును ప్రజాశక్తి వివరణ కోరగా ఆ సమస్య తన దృష్టికి ఇప్పుడే వచ్చిందని, వేలాడే విద్యుత్‌ వైర్లను రెండు రోజుల్లో సరి చేస్తామని ఆయన తెలిపారు.