Jun 11,2023 23:59

మండల కేంద్రంలోని స్టాక్‌ పాయింట్‌ లో ఉన్న షూస్‌

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యా కానుకతో పాటు పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 12న పాఠశాలలు పున్ణప్రారంభం కానున్నాయి. ఇంతవరకు పూర్తిస్థాయిలో జగనన్న విద్యా కానుక కిట్లు(జెవికె)
అందులోని పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు పాఠశాలలకు చేరలేదు. ఆదివారం సాయంత్రం వరకు ఆయా పాఠశాలలకు సంబంధించిన జగనన్న కిట్‌ ల సామగ్రి పాఠశాలల సిబ్బంది దగ్గరుండి తీసుకెళ్తూనే ఉన్నారు.
అల్లూరి జిల్లాలో సుమారు 1లక్ష 66వేల 709 మంది విద్యార్థులకు జెవికె కిట్లు ఇస్తున్నామని డిఇఒ కార్యాలయం అధికారులు తెలిపారు. అన్ని సబ్జెక్టుల పుస్తకాలు సకాలంలో సరఫరా చేయకపోతే బోధన కుంటుపడుతుంది. మే 31 నాటికి ఇవి పాఠశాలలకు చేరాల్సి ఉన్నా కొన్ని మండలాల్లోని గోదాములకే బ్యాగులు, పుస్తకాలు పూర్తిస్థాయిలో చేరలేదని సమాచారం. ఈ విద్యా సంవత్సరంలో పలు పాఠ్య పుస్తకాలు మారాయి. 9వ తరగతికి అన్ని సబ్జెక్టుల పుస్తకాలు మారాయి. 6, 7 తరగతులకు ఇంగ్లీష్‌, సైన్స్‌, గణితం మారడంతో నూతన పాఠ్యాంశాలతో వాటిని సరఫరా చేస్తున్నారు. 6, 7 తరగతులకు సంబంధించి మారిన సబ్జెక్ట్‌ల పాఠ్యపుస్తకాలు ఇంతవరకు చేరలేదని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు.
ప్రచార ఆర్భాటం
గత సంవత్సరం కూడా కానుకలోని వస్తువులు అరకురగానే సరఫరా చేశారు నాసిరకం బ్యాగులు అందించారు. ఈ సంవత్సరమైనా పూర్తిస్థాయిలో వస్తువులు అందిస్తారా లేదా అన్నది అనుమానమే జగనన్న విద్యా కానుక పథకం అమలు చేస్తున్నప్పటి నుంచి ఒక సంవత్సరం కూడా పూర్తిస్థాయిలో వస్తువులు అందజేసిన దాఖలాలు లేవు. ప్రతి ఏటా వస్తువుల్లో కోత విధిస్తున్నారు. గత ఏడాది బూట్లు, సాక్షులు, బెల్టులు, డిక్షనరీలు అరకురగానే వచ్చాయి. మొదటి రోజు కొన్ని మాత్రమే పంపిణీ చేశారు. జూన్‌ నెలాఖరులోపు అన్ని వస్తువులు అందజేస్తామన్నారు. విద్యా సంవత్సరం పూర్తయినా పలు వస్తువులు విద్యార్థులకు అందలేదు. ఈ సంవత్సరం కూడా రాత పుస్తకాలు, బూట్లు, బ్యాగులు పూర్తిస్థాయిలో చేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం సరఫరా చేసిన వస్తువుల వివరాలను అధికారులు వెల్లడించలేదు.
అరకొరే..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా కానుక కింద స్కూల్‌ బ్యాగు, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, రెండు జతల యూనిఫామ్‌, బెల్టు, బూట్లు, సాక్షులు డిక్షనరీ ఉంటాయి. అల్లూరి జిల్లాలో 1లక్ష 66వేల 709 మంది విద్యార్థులకు కిట్లు అందజేయాల్సి ఉంది. ఇంకా ఆయా వస్తువులు రావాల్సి ఉందని సమాచారం.