Jul 16,2023 21:48

పాచిపెంట.. మీనామృతం తయారు చేయిస్తున్న ఎఒ తిరుపతిరావు

ప్రజాశక్తి-పాచిపెంట : చేపల వ్యర్థాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రీసైకిల్‌ చేసుకుని, పంటలకు ఎరువుగా తయారు వచ్చని ఎఒ కె.తిరుపతిరావు తెలిపారు. మండలంలోని పాంచాలి, రెట్లపాడు గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. పాంచాలి రైతు భరోసా కేంద్రం వద్ద మీనామృతం తయారు చేయించారు. చేపల వ్యర్థాల్లో ఉండే అమైనో యాసిడ్‌ పంటల పెరుగుదలకు ఉపయోగపడతాయని చెప్పారు. చీడపీడల నిరోధక శక్తిని పెంచుతాయన్నారు. ఈ విధంగా చేయడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని తెలిపారు. ఈ అమైనా యాసిడ్లు బయట కొనుక్కుంటే వేలాది రూపాయల ఖర్చవుతాయని చెప్పారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దనే మీనామృతం తయారు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా బీజామృతంతో రాగి విత్తన శుద్ధి చేయించారు. కార్యక్రమంలో సిఆర్‌పి తిరుపతి నాయుడు, ఐసిఆర్‌పిలు సుకరమ్మ, రమణ, విఎఎ శ్రీను పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని రావివలస , శివ్యాం, గ్రామాలలో ఆదివారం మీనామృతాన్ని రైతులతో తయారు చేయించినట్లు ప్రకృతి వ్యవసాయ మండల ఇన్‌ఛార్జి వి.పోలినాయుడు తెలిపారు. మీనామృతంతో ప్రయోజనాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో బూరి శ్రీనివాసరావు, రైతులు జి.ఈశ్వరరావు, ఎస్‌.అప్పలనాయుడు, ఎ.అప్పలనాయుడు, ఎన్‌. అప్పలనాయుడు, ఆర్‌.త్రినాథ తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులు డిఎపికి బదులుగా ఘనజీవామృతం వాడితే ఎంతో మేలని ప్రకృతి వ్యవసాయం కోఆర్డినేటర్‌ భూషణరావు అన్నారు. మండలంలోని చెముడుగూడ పంచాయతీ పుట్టగూడ గిరిజన గ్రామంలో మహిళా రైతులతో ఘన జీవామృతం తయారు చేయడంపై అవగాహన కల్పించారు. ఘన జీవామృతం వినియోగిస్తే మొక్కకు కావలసిన పోషకాలు ఎక్కువ స్థాయిలో అందిస్తూ భూమి సారవంతమై, పంట ఏపుగా పెరుగుతుందన్నారు. మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు. గ్రామంలోని రైతు తన ఇంటి వద్ద స్వయంగా ఘన జీవామృతం తయారు చేసుకోవచ్చన్నారు. మొక్కకు కావలసిన పోషకాలు, వానపాములు అధిక సంఖ్యలో ఉత్పత్తి చెందుతాయని చెప్పారు. పురుగులు, తెగుళ్లు కూడా అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిఆర్‌పిలు కడ్రక దీప, నిమ్మల పద్మ, కొండగొర్రె పద్మజ పాల్గొన్నారు.