Oct 07,2023 21:22

భారీగా తగ్గిన రూప్‌చంద్‌ ధర
కిలో రూ.70లోపే పలుకుతున్న దుస్థితి
కిలో చేప పెంపునకయ్యే ఖర్చు రూ.95
రెండు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రూప్‌చంద్‌ సాగు
ధర పతనంతో లబోదిబోమంటున్న ఆక్వా రైతులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

రూప్‌చంద్‌ చేపల సాగు చేసే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర భారీగా పడిపోవడంతో సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. పరిస్థితి ఎప్పటికి కుదుటపడుతుందో తెలియక ఆక్వా రైతులు నలిగిపోతున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రొయ్యల సాగు తర్వాత పెద్దఎత్తున రూప్‌చంద్‌ చేపల సాగు సాగుతోంది. వేలాది ఎకరాల్లో రూప్‌చంద్‌ సాగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కొంతకాలం క్రితం వరకూ కిలో రూప్‌చంద్‌ చేప ఖరీదు రూ.వందకుపైగా ఉండేది. దీంతో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. పశ్చిమబెంగాల్‌, బీహార్‌ వంటి అనేక రాష్ట్రాలకు ఎగుమతి కావడంతోపాటు స్థానికంగా ఈ చేపలను ఎక్కువగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. శ్రావణమాసం, వినాయకచవితి వంటి అనేక కారణాలతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు భారీగా తగ్గిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో రూప్‌చంద్‌ ధర రూ.70లోపే పలుకుతోంది. కిలో రూప్‌చంద్‌ను తయారు చేయడానికి అన్ని ఖర్చులూ కలుపుకుని రూ.95 వరకూ ఖర్చవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. మేత ఖర్చు ఎక్కువ మొత్తంలో అవుతుంది. ధర పతనంతో కిలో చేపకు రూ.25 వరకూ రైతులు నష్టపోతున్నారు. ఎకరా చెరువులో నాలుగు వేల నుంచి ఐదు వేల వరకూ రూప్‌చంద్‌ చేప పిల్ల వేస్తారు. దిగుబడి సైతం నాలుగు టన్నుల వరకూ వస్తుంది. ధర పతనంతో ఎకరాకు రూ.2.50 లక్షల వరకూ రైతులు నష్టపోతున్నారు. ఐదెకరాల చెరువుల్లో రూప్‌చంద్‌ సాగు చేస్తే దాదాపు రూ.12 లక్షల వరకూ రైతులు నష్టం చవిచూడాల్సి వస్తోంది. దీంతో రైతులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కనీసంగా కిలో చేప రూ.80కైనా కొనుగోలు చేయాలంటూ వ్యాపారులను రైతులు కోరుతున్నారు. ఆ విధంగా కొనుగోలు చేస్తే కొంతలో కొంత నష్టాలు తగ్గుతాయని రైతులు భావిస్తున్న పరిస్థితి నెలకొంది. వేల ఎకరాల్లో సాగుతున్న రూప్‌చంద్‌ చేపల సాగుపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఉంగుటూరు మండలంలో ఆక్వా రైతులు, ట్రేడర్స్‌ సమావేశమై కిలో రూప్‌చంద్‌ రూ.80కు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇది అమలు జరుగుతుందా, లేదా అనేది చూడాలి. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రూప్‌చంద్‌ ధర తగ్గుదలపై మత్స్యశాఖ జెడి ఆర్‌విఎస్‌వి.ప్రసాద్‌ను వివరణ కోరగా రూప్‌చంద్‌ ధర కొంత తగ్గినమాట వాస్తవమేనన్నారు. దీనిపై ట్రేడర్స్‌తో మాట్లాడామని, మేత ధరలు తగ్గించడం వంటి చర్యలు చేపట్టామని వివరించారు.
రూ.80కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని కోరాం
పొత్తూరి శ్రీనివాసరాజు, ఆక్వారైతు, ఉంగుటూరు
రూప్‌చంద్‌ చేప ధర బాగా తగ్గిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. కిలో చేప పెంపునకు అన్ని ఖర్చులూ కలుపుకుని రూ.95 వరకూ అవుతోంది. మార్కెట్లో ధర మాత్రం కిలో రూ.70లోపే ఉంది. ప్రస్తుత పరిస్థితి నుంచి రైతులు బయట పడాలంటే కిలో రూ.80కైనా కొనుగోలు చేయాలని ట్రేబర్స్‌ను కోరాము. ఆక్వారైతులు, ట్రేడర్స్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. 15వ తేదీన మరోసారి పెద్దఎత్తున సమావేశం నిర్వహించనున్నాం.