Oct 15,2023 22:17

సమస్యను సిఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ
ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి : రైతులు
నారాయణపురంలో ఆక్వా రైతుల జిల్లా సమావేశం
ప్రజాశక్తి - ఉంగుటూరు

            రూప్‌చంద్‌ చేపల సాగు ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, సమస్యను సిఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి రైతులకు మేలు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎంఎల్‌ఎ, ఆక్వా రైతుల అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు పుప్పాల వాసుబాబు అన్నారు. రూప్‌చంద్‌ చేప ధర పడిపోయిన నేపథ్యంలో కార్యాచరణ కోసం ఆక్వా రైతుల జిల్లా బహిరంగ సమావేశం ఆదివారం రాత్రి ఉంగుటూరు మండలం నారాయణపురంలో నిర్వహించారు. పొత్తూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ సభకు ఎంఎల్‌ఎ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కోవిడ్‌ సమయంలో రొయ్యకు గిట్టుబాటు ధర కల్పించినట్లుగా రూప్‌చంద్‌ చేపకు కూడా గిట్టుబాటు ధర కల్పించేలా సిఎం, కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ముఖ్యమైన పది మంది రైతులు తనతో వస్తే అమరావతి తీసుకెళ్లి సిఎంతో మాట్లాడిస్తానని వాసుబాబు హామీ ఇచ్చారు. ఆక్వా జోన్‌ రైతులకు ముఖ్యమంత్రి ఇప్పటి వరకూ రూ.1800 కోట్లు సబ్సిడీలు ఇచ్చారని తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని తెలిపారు. ఫీడ్‌... సీడ్‌... సబ్సిడీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండేలా అప్సరా చట్టాన్ని అమలు చేసేలా ప్రయత్నిస్తామన్నారు. ఆక్వా జోన్‌ రైతులందరికీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు. చేప ధర తగ్గడం వెనుక అనేక కారణాలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలపై చర్చించాల్సి ఉందన్నారు. ఆక్వా రైతు దుబారు రాము మాట్లాడుతూ రైతులంతా సంఘటితంగా ఉండి నవంబరు నెలాఖరు వరకూ రూప్‌ చంద్‌ అమ్మకుండా ఉంటే ట్రేడర్స్‌ మన దగ్గరకే వస్తే మంచి ధర వస్తుందన్నారు. దీనికి భిన్నంగా రైతులు తొందర పడి ట్రేడర్స్‌ తీసుకొచ్చే ఒత్తిడితో తక్కువ రేటుకు అమ్మి మీరు నష్టపోవడమే కాకుండా పక్క రైతుకు నష్టం కలిగించొద్దని హితవు పలికారు. నిడమర్రు, మల్లవరం, గణపవరం రైతులు మాట్లాడుతూ చాలా మంది ఐదు ఎకరాల్లోపే చేపల సాగు చేసే రైతులంతా అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఈ దశలో ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే 300 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, చెరకు తదితర పంటలకు కనీస మద్ధతు ధర ఉన్నట్టే చేపలకు కూడా మద్ధతు ధరలను ప్రభుత్వం ప్రకటించాలని సమావేశం తీర్మానించింది. చెరువులో రూప్‌చంద్‌తో పాటు తెల్ల చేపలు పెంచుతున్నామని పట్టుబడిలో రూప్‌చంద్‌ ధర పతనంతో పాటు తెల్లచేప ధరను సైతం ట్రేడర్స్‌ తగ్గించి కొంటున్నారని దీన్ని నియంత్రణ చేసే బాధ్యత అసోసియేషన్‌ తీసుకోవాలని కోరారు. చేపలు కొనే ట్రేడర్స్‌ పట్టుబడిని ఒకే రోజులో పూర్తి చేయాలని రెండు, మూడు రోజుల పట్టుబడి పట్టి కిలో రూ.80 ఇచ్చినా రైతుకు నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. ఫిష్‌ ఆంధ్రా స్కీమ్‌ను అమలు చేస్తే కొంతవరకు ఉపయోగంగా ఉంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వందలాది మంది రైతులు పాల్గొన్నారు.