
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : 'చేను చెల్లిపోయాక కల్లం కాపు' అంటే ఇదేనేమో... లేకపోతే ఇందేంటండి బాబు.... మరో వారం రోజుల్లో బడులకు వేసవి సెలవులు రానున్నాయి. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఈ సమయంలో పుస్తకాల గొడవేంటిరా బాబు' ఇదీ విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పబ్లిక్ టాక్. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడం తప్పుకాదు. కానీ, ఈ పని ఎప్పుడో చేయాల్సివుంది... ఇంత ఆలస్యంగా స్పందించడం మాత్రం తప్పుకాదా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పార్వతీపురం మన్యం జిల్లాలో గురు, శుక్రవారాల్లో పర్యటించిన విషయం విధితమే. రాత్రి వరకు ఆకస్మిక తనిఖీలు చేయడంతో అధికారులు పరుగులు తీశారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లిమరీ లోపాలను ఎత్తిచూపారు. వాటి పరిష్కారానికి అధికారులు, సిబ్బందికి ఎన్నో సూచనలు, ఆదేశాలు చేశారు. ఇంత వరకు బాగానేవున్నా వీరఘట్టం మండలం రేగులపాడు కెజిబివికి పుస్తకాలు అందకపోవడం పట్ల డిఇఒ, ఎంఇఒ, అసిస్టెంట్ గర్ల్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, కెజిబివి ప్రిన్సిపాల్ లను సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం తప్పు కాదని, పుస్తకాల పంపిణీలో జాప్యానికి కేవలం అధికారులనే బాధ్యులు చేయడం బాధాకరణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు బలమైన కారణాలనే ఎత్తిచూపుతున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 3384 ప్రభుత్వ స్కూళ్లు, దాదాపు 800 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ స్కూళ్లలో 2,31,137మంది, ప్రైవేటు స్కూళ్లలో 80వేల మంది ఉన్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో 9,10 తరగతులకు 9రకాలు, 8వ తరగతికి 8రకాలు, 6,7 తరగతులకు 6రకాలు, 3,4,5 తరగతులకు 4నుంచి 5రకాలు, 1, 2 తరగతులకు 2రకాల చొప్పున 25లక్షలకుపైగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాల్సివుంది. కానీ, జులై 15వ తేదీ వరకు ఈ రెండు జిల్లాల్లో కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 14,31,141 పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందులోనూ 6వ తరగతి విద్యార్థులకు ఆరు రకాల పుస్తకాలు పంపిణీ చేయాల్సివుండగా దాదాపు అన్ని స్కూళ్లకూ మూడు రకాల పుస్తకాలు మాత్రమే అందాయి. అప్పటికి కొన్ని స్కూళ్లకు తెలుగు, సైన్స్, ఇంగ్లీషు మాత్రమే ఇచ్చారు. మిగిలిన స్కూళ్లకు లెక్కలు, హిందీ, సోషల్ పుస్తకాలను సర్థుబాటు చేశారు. పుస్తకాల కొరతను తెలియనివ్వకుండా ఇలా సర్థుబాటు చేసిన విషయం అప్పట్లో ఉపాధ్యాయులు గుర్తించారు. అరకొరగా వచ్చిన పుస్తకాలు ఎవరికి పంచాలో అర్థం కాక ఉపాధ్యాయులు అప్పట్లో తలలు పట్టుకున్నారు. ఇంకోవైపు సకాలంలో పుస్తకాలు అందజేయకపోతే పాఠ్యాంశాలు ఎలా బోధిస్తామని, సంవత్సరాంతంలో ఫలితాలు తగ్గితే వేధింపులకు గురిచేస్తారని ఉపాధ్యాయులు వారిలో వారే గుసగుసలాడుకునే పరిస్థితి కనిపించింది. దీంతో, అప్పట్లో ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.
నూతన విద్యావిధానంలో భాగంగా ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్లలోపుగల ప్రాథమిక పాఠశాలను విలీనం పేరిట మూసివేసేందుకు చూపిన శ్రద్ధ పాఠ్యపుస్తకాల ముద్రనపై ప్రభుత్వమే అప్పట్లో శ్రద్ధ చూపలేదు. దీనికితోడు కొన్ని ముద్రణా సంస్థలపై అమితమైన ప్రేమ కనబరుస్తూ ఎక్కువ ఆర్డర్లు ఇవ్వడం వల్ల సకాలంలో ప్రింటింగ్ కాలేదు. చివరికి పాఠ్యపుస్తకాల ప్రచురణలోనూ సర్కారు వ్యాపార ధోరణి అవలంభించడంతో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు 100శాతం పుస్తకాలు అందరికీ అందిపోయినట్టు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారు. మరికొన్ని చోట్ల నేరుగా సచివాలయాల్లోని బయోమెట్రిక్ మిషన్లు పట్టుకుని ఏకంగా వాలంటీర్లూ రంగంలోకి దిగారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్టుగా ప్రభుత్వమే పుస్తకాలన్నీ ఇచ్చేసినట్టు లెక్కలు చూపించమని ఒత్తిడి చేయంతో ఆ తరువాత వచ్చిన పుస్తకాలు మూలనపడేసి ఉండవచ్చు. ఆలస్యంగా వచ్చిన పుస్తకాలు పాఠశాలలకు వెళ్లాయా? లేదా? అన్నది కూడా బహుశా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కూడా ఆలస్యంగానే పరిశీలించారు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలే కరువా? అన్నట్టు ఎంతైనా ముఖ్యకార్యదర్శి కాబట్టి డిఇఒ సహా నలుగుర్ని సస్పెడ్ చేశారు. ఇప్పటికైనా చేను చెల్లిపోయాక కల్లం కాపు మాదిరిగా పాఠశాల మూసివేత దశలో కాకుండా ప్రారంభంలోనే పుస్తకాలు వెళ్లాయా? లేదా? అనేది చూసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.