Aug 23,2023 21:15

పరిశీలిస్తున్న మేయర్‌

పరిశీలిస్తున్న మేయర్‌
చేనేతను ప్రోత్సహిద్దాం.. నేతన్నను ఆదరిద్దాం
- మేయర్‌ స్రవంతిజయవర్ధన్‌
ప్రజాశక్తి-నెల్లూరు:చేనేత, హస్తకళలను ప్రోత్సహించి వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కళాకారులను ప్రతిఒక్కరూ ఆదరించాలని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ స్రవంతిజయవర్ధన్‌ పిలుపునిచ్చారు. స్థానిక దర్గామిట్ట లోని ఎన్జీఓ హౌం నందు శ్రీ కళాదర్శిని హ్యాండ్‌ లూం, హ్యాండిక్రాఫ్ట్‌ ఎక్జిబిషన్‌ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా మేళాను నగరపాలక సంస్థ మేయర్‌ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ చేనేత, హస్తకళలపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని, మన తెలుగు రాష్ట్రాల చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని, పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం చీరలకు దేశంలోని వివిధ ప్రాంతాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయని మేయర్‌ తెలిపారు
. చేనేత కళాకారులకు ఇప్పటికీ కొంత ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయని, ముఖ్యంగా ముడిసరకు ధరల్లో పెరుగుదల, తయారు చేసిన వస్త్రాలకు సరైన మార్కెటింగ్‌ సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కుంటున్నారని, అయినప్పటికీ వారు ఈ వత్తిని వదలకుండా కొనసాగిస్తున్నారని మేయర్‌ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చేనేత హస్తకళా మేళా వంటి కార్యక్రమాలు చేనేత కళాకారులకు ఎంతో ఉపయోగపడుతాయని, నేరుగా వారే తమ ఉత్పత్తులను విక్రయించడానికి వీలుంటుందని తెలియజేశారు. ప్రతిఒక్కరూ చేనేత హస్తకళా మేళాను సందర్శించి వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత, హస్తకళల కళాకారులను ఆదరించాలని ఆకాంక్షించారు.