ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
చేనేతలపై కేంద్రం పన్ను విధించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నేకేశవ రెడ్డి, జడ్‌పి ఛైర్మన్ పాపి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం కేంద్రం అన్నింటిపైనా పన్ను వేస్తోందని, మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. బిజెపి వల్ల పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధాని చేయడానికి గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అలాగే పద్మశాలి సంఘం కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. చేనేత కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి సన్మానించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు, రోహిణి ఇన్‌ఫ్రా అవెన్యూ ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కొంకతి లక్ష్మి నారాయణ మాట్లాడారు. చేనేతలను కాపాడడానికి రాజకీయ పార్టీలు న్యాయం చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో చేనేత సామాజిక వర్గానికి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించాలని తెలిపారు.
ఎమ్మెల్యేను సన్మానిస్తున్న నాయకులు










