Jun 19,2023 21:27

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌
చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్‌ సి.గురు శేఖర్‌, చేనేత కార్మిక సంఘం నాయకులు విమర్శించారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు చేనేత కార్మిక సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షులు కనికే లక్ష్మన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామర్తి రాజు, ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాధవస్వామి, గణేష్‌, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్‌ సి.గురుశేఖర్‌, వృత్తి సంఘాల సీనియర్‌ నాయకులు గోవిందు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక నాయకులు శేషఫణి మాట్లాడారు. దేశంలో నేతన్నల పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది చేనేత కార్మికులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కర్నూలు జిల్లాలో కోడుమూరు, ముడుములగుర్తి, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, నందవరం, నాగలదిన్నె, గుడికల్‌, ఆదోని, కోసిగిలలో దాదాపు 30 వేల చేనేత కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. వీరు తయారు చేసిన వస్త్రాలు పేరుకుపోయి చేనేత రంగం సంక్షోభంలో పడిదని చెప్పారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. చేనేతలకు 11 రకాల రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రతి కుటుంబానికీ 3 సెంట్ల స్థలమిచ్చి షెడ్డు నిర్మించాలని కోరారు. నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24 వేలు ప్రతి చేనేత కార్మికునికీ షరతులు లేకుండా ఇవ్వాలని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతి చేనేత కుటుంబానికీ రూ.5 వేల పింఛను ఇవ్వాలన్నారు. చేనేత కుటుంబానికి రూ.లక్ష రాయతీతో కూడుకున్న రుణం మంజూరు చేయాలని కోరారు. చేనేత కార్మికుడు అకస్మాత్తుగా మరణిస్తే వయస్సుతో నిమిత్తం లేకుండా బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో పేరుకుపోయిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఇతర రాష్ట్రాల పవర్‌ లూమ్‌పై తయారవుతున్న వస్త్రాలను రద్దు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ డాక్టర్‌ సృజనకు వినతిపత్రం అందజేశారు. చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కాలప్ప, సహాయ కారదర్శి కృష్ణ, జిల్లా నాయకులు రాజు, ఎల్లప్ప, శీను, లక్ష్మన్న, కృష్ణ పాల్గొన్నారు.